గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సాకేత్ బిల్డర్ అక్రమాలకు నిరసనగా భూ సత్వా ఫేస్ -1 నివాసితులు, సాకేత్ ప్రణామం వయోవృద్ధులు సంయుక్తంగా శనివారం ధర్నా చేశారు. సుమారు రెండు వందల నివాసితులు ర్యాలీగా వచ్చి గౌడవల్లి సాకేత్ భూ సత్వా బిజినెస్ కార్యాలయం వద్ద సమావేశమై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సాకేత్ ప్రణామం ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరంగారావు, వల్లభేంద్రరెడ్డి మాట్లాడుతూ ఫ్లాట్స్, విల్లాలు కొన్నవారికి మాయమాటలు చెప్పి కొనిపించారని , ఇస్తామన్న సౌకర్యాలు ఇవ్వలేదని అన్నారు. సాకేత్ బిల్డర్ అసంపూర్తి పనులు చేసి నివాసితులకు అపార్ట్ మెంటులోని రెండు బ్లాక్ లలోని ఫ్లాట్లను, ఫేస్-1 లోని విల్లాలను అప్పగించారని, దానిపై రేరా కోర్టుకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి ఏప్రిల్ 11 న నివాసితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆ తీర్పులో 60 రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారని, అయితే బిల్డర్ ఖర్చు లేని చిన్నచిన్న పనులు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని నివాసితులు ఆరోపించారు. వసూలు చేసిన నిర్వహణా డబ్బులకు లెక్కలు చెప్పాలని, ఇచ్చిన హామీ మేరకు వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణం తదితర పనులు పూర్తిచేసి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. భూ సత్వా విల్లాల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ తమకు మంచినీటి సౌకర్యం, భద్రత లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని, మునిసిపల్ నీటి సౌకర్యం ఇస్తామని చెప్పి 75 వేల నుంచి లక్ష వరకు వసూలు చేసి కలుషిత నీటిని ఇస్తున్నారని ఆరోపించారు. విల్లాలు, అపార్ట్ మెంట్స్ మెయింటైనెన్స్ అధ్వానంగా ఉంటున్నాయని, నెలనెలా వసూలు చేసిన డబ్బులకు లెక్కలు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అన్నారు. వాడిన మురుగు నీటిని శుద్ధి చేయకుండా వదిలివేస్తున్నారన్నారు. దీనితో నివాసితులు అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. శాశ్వత కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని, హెచ్ యం డి ఏ నిబంధనల మేరకు పనులు పూర్తిచేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. “రేరా తీర్పుని అమలు చేయాలి” “క్యాంటీన్ తో చేసుకున్న ఒప్పందం – బయటపెట్టాలి”, “వసూలు చేసిన మైంటెనెన్సు సొమ్ముకు లెక్కలు చెప్పాలి “ వంటి నినాదాలతో ఉన్న ప్లే కార్డులతో వృద్ధులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొని తమ సమస్యలను విన్నవించడం విశేషం. ఈ కార్యక్రమంలో రామకృష్ణరాజు, సురేఖా రాజకుమార్, అరుణాచలం, సవిత, ఉష తదితరులు పాల్గొన్నారు. ఇంత జరుగుతున్నా బిజినెస్ కార్యాలయం నుంచి బిల్డర్ కు సంబంధించి ఏ ఒక్కరూ బయటకు వచ్చి చూడలేదు, సమాధానం చెప్పలేదు.
