యైటింక్లయిన్ కాలని. ముద్ర: ప్రమోషన్ల పాలసీలో జరుగుతున్న జాప్యాన్ని నివారింవి, ఆపరేటర్ల ప్రమోషన్లు బ్యాక్ డేట్ తో ఇప్పించాలని కోరుతూ..సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఏరియా కమిటీ శుక్రవారం ఓసీపీ.3 ప్రాజెక్ట్ యాజమాన్యానికి వినతి పత్రం అందించింది. యూనియన్ ఏరియా కమిటీ కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ తోటి కమిటీ ప్రతినిధులతో కలిసి, ఉదయం ప్రాజెక్ట్ మేనేజర్ భరత్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. గనుల్లో నాడు ఫిల్లింగ్ కార్మికులు బొగ్గు ఉత్పత్తులు వెలికి తీయగా, నేడు ఈపి ఆపరేటర్లు వెలికి తీస్తూ, నిర్దేశిత బొగ్గు ఉత్పత్తులను అధిగమిస్తున్నారన్నారు. అయినప్పటికీ వారికి న్యాయంగా అమలు చేయాల్సిన ప్రమోషన్ పాలసీలో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. సింగరేణి సంస్థ యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఆపరేటర్లు ముందంజలో ఉంటూ నిరంతరం సంస్థ లాభాలకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పాలసీ ప్రకారం నిర్ణిత కాలానికి ప్రమోషన్ల రాకపోవడంతో, ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రమోషన్ల పాలసీ అమల్లో చొరవ తీసుకొని పెండింగ్ లో ఉన్న డి గ్రేడ్ టూ సి గ్రేడ్, సి టూ బి గ్రేడ్ ప్రమోషన్లు బ్యాక్ డేట్ తో ఇప్పిస్తూ ఏరియార్స్ చెల్లించేలా కృషి చేయాలని ఆయన ప్రాజెక్ట్ మేనేజర్ కు విజ్ఞప్తి చేశారు. ఇక వినతి పత్రం అందజేసిన వారిలో కమిటీ సహాయ కార్యదర్శి వినేష్, శివకుమార్, సంతోష్, తిరుపతి, రాజేందర్ పాల్గొన్నారు.