రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో నిర్మించిన 286 డబుల్ బెడ్రూం (టుబిహెచ్కె) ఇండ్లలో అర్హులైన 230 మందికి ఇంటి నెంబర్లు,బ్లాకుల కేటాయింపు లక్కీ డ్రా పద్ధతి ద్వారా నిర్వహించినట్లు మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసులు,మందమర్రి ఎమ్మార్వో పీ.సతీష్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సింగరేణి ఆర్కేసీఓఏ క్లబ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారుల సమక్షంలో లక్కి డ్రా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో పీ.సతీష్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్ సాఫ్ట్వేర్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే ఇండ్ల పట్టాలను అందిస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు,బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,ఆర్కేపీ పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్ ఉన్నారు.
- వెనుతిరిగిన అనర్హులు.
ఇండ్ల బ్లాకుల,నెంబర్ల కేటాయింపులో 230 మంది అర్హులను మాత్రమే అధికారులు లోపలికి అనుమతించారు. దీంతో అక్కడికి వచ్చిన అనర్హులు వెనుతిరిగి పోయారు. నీరు పేద కుటుంబాలకు చెందిన పేదలు అనేక మంది ఉన్నారని,వారిని గుర్తించి మిగిలిన డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులను అర్హులుగా కొందరు లీడర్లు,అధికారులు చేశారంటూ వారు ఆరోపించారు. మిగిలిన ఇండ్ల కొరకు తాము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలుస్తుంది.
