నాలుగు రోజుల్లో రూ.10.71 కోట్ల ఆదాయం
మేడారం/హనుమకొండ, ఫిబ్రవరి 8:
సమ్మక్క–సారక్క జాతర–2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హూండీల లెక్కింపు నాల్గో రోజు కూడా హనుమకొండలోని టిటిడి కళ్యాణ మండపంలో కొనసాగింది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ సాగుతోంది.
జాతరకు సంబంధించి మొత్తం 828 హూండీలు ఏర్పాటు చేయగా, అందులో 780 ఇనుప హూండీలు, 45 వస్త్ర హూండీలు, 3 బియ్యం హూండీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాల్గో రోజు భాగంగా 200 హూండీలను తెరిచి లెక్కించగా, వాటి ద్వారా రూ.2,64,75,757/- ఆదాయం లభించినట్లు వెల్లడించారు.
ఇంతకుముందు
•ఫిబ్రవరి 5న 125 హూండీల లెక్కింపులో రూ.2,49,65,000/-,
•ఫిబ్రవరి 6న 160 హూండీల లెక్కింపులో *రూ.3,54,25,200/-*తో పాటు విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ.63,436/-,
•ఫిబ్రవరి 7న 140 హూండీల లెక్కింపులో *రూ.2,01,21,440/-*తో పాటు విదేశీ కరెన్సీ మార్పిడి ద్వారా రూ.71,283/- ఆదాయం లభించింది.
నాలుగు రోజుల వ్యవధిలో మొత్తం 625 హూండీలను లెక్కించగా, కలిపి రూ.10,71,22,116/- ఆదాయం సమకూరినట్లు అధికారులు స్పష్టం చేశారు.
నాల్గో రోజు లెక్కించిన నగదులో నుంచి రూ.2,64,75,757/- మొత్తాన్ని పర్యవేక్షణాధికారుల సమక్షంలో బ్యాంకు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. బంగారం, వెండి కానుకలను వేర్వేరుగా ఇనుప హూండీలలో భద్రపరచి తాళాలు వేసి ఉంచినట్లు పేర్కొన్నారు. నాణేల లెక్కింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.