ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ఈకో టూరిజం వల్ల అనంతగిరి రూపురేఖలే మారబోతున్నాయని, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద మొత్తంలో పనులు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం అనంతగిరి గుట్టలో ఈకో టూరిజం అభివృద్ధిలో భాగంగా అనంతగిరి ఈకో అర్బన్ పార్క్, అనంతగిరి కొండల వీక్షణ గోపురం, అనంతగిరి పర్యావరణ పట్టణ ఉద్యాన వనము, అటవీ అతిథి గృహంలో డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ దీ బ్రీజ్ ను అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సి.సువర్ణ, చీఫ్ కన్సర్వేటర్లు ప్రియాంక వర్గీస్, సునీత భగవత్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ , మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య లతో కలిసి సభాపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అనంతగిరి ప్రాంతాన్ని పర్యావరణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వల్ల వికారాబాద్ దశలవారీగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈకో టూరిజం వల్ల పడిసర ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయని ఆయన తెలిపారు. అనంతగిరిగుట్టలో వివిధ ఔషధ గుణాలు కలిగిన మూలికల చెట్లు ఉన్నందున పర్యాటకులు ఈ ప్రాంతానికి పెద్ద మొత్తంలో వస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న పనులంటిని త్వరితగతిన పనులను చేపట్టి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం మూసీ నది జన్మస్థల ప్రాంతాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.