ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వసతి గృహాలలో పారిశుద్ధ్యం, నాణ్యమైన భోజనంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు.
99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి సంక్షేమ వారోత్సవాల నేపథ్యంలో మొదటి రోజున సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల వంట గదులు, పరిసరాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహార నాణ్యతపై అవగాహన కింద సోమవారం జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సి బిసి బాలుర వసతి గృహాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సందర్శించారు. వంట విధానం, వంట తయారీ ప్రక్రియను పరిశీలించి, మెనూ ప్రకారము విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
వంటకు ఉపయోగిస్తున్న పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరుకులు నాణ్యతతో సరైన ప్రమాణాలతో ఉండాలని ఆదేశించారు.
వసతి గృహాల పరిసరాల్లో పారిశుద్ధ్యం పరిస్థితిని పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని తెలిపారు.
విద్యార్థులు తిరిగి వచ్చే వరకు ఏవైనా మరమ్మత్తు పనులు ఉంటె వాటిని పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎస్సి వెల్ఫేర్ అధికారి జయపాల్ రెడ్డి, మాధవ రెడ్డి, ఏం పి డి ఓ వినోద్ కుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.