- వివిధ శాఖల అధికార్లతో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
- విపత్తు నిర్వహణపై పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి సమీక్షా సమావేశం.
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం : విపత్తుతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్ల కుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికా రూపొందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికార్లను ఆదేశించారు.శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి, విపత్తు నిర్వహణపై రెవెన్యూ, ఇర్రిగేషన్, పంచాయతీ రాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విపత్తుల నష్ట నివారణ కోసం ముందస్తు ఏర్పాట్లతో అధికారులు హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ, సన్నద్ధంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రజలకు కష్టం కలగ కుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. వర్షాలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాలు, ప్రమాదకర నీటి వనరుల పట్ల ముందస్తుగా మ్యాపింగ్ చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉన్న వారిని ముందు రోజు సురక్షిత ప్రాంతానికి చేర్చాలని, ఇందుకు ప్రతి గ్రామంలో ఒక భవనాన్ని గుర్తించి సిద్ధంగా ఉంచాలన్నారు.ప్రతి మురికి కాల్వను పరిశీలించి, పడ్డ వర్షం బయటకు వెళ్తుందో లేదో చూడాలనన్నారు. మురికికాల్వకు డిసిల్టింగ్ చేసి, ఎక్కడా నీరు ఆగకుండా వుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆపద మిత్ర క్రింద యువతి, యువకులను గుర్తించి విపత్తు నిర్వహణపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 139, పట్టణ ప్రాంతాల్లో 161 మంది యువతీ యువకులను ఆపద మిత్ర క్రింద ఎంపిక చేసి 10 రోజుల క్లాస్ రూమ్ శిక్షణ, క్షేత్ర స్థాయి శిక్షణ ఇచ్చి, వైద్య పరీక్షలు నిర్వహించి వారికి జీవిత భీమ చేయించినట్లు పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండి అధికారులు, ఆపద మిత్ర, ఫిషర్ మెన్, ఈతగాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమాచారం అందిపుచ్చుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వీరు విపత్తులను ఎదుర్కోవడానికి జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు తహశీల్దార్ల ఆధీనంలో ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను కలెక్టరేట్ వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు.టూరిజం, ఫిషర్ మెన ల వద్ద గల పడవలకు తనిఖీలు చేసి, ఇంధనంతో అన్ని రకాలుగా సిద్ధపర్చాలనీ సూచించారు.విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి ముంపు ప్రాంతాల్లో ఉన్న మేజర్ టవర్లకు ఏమైనా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నచోట ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రాల్లో 1077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ పని చేస్తుందని, మండల కేంద్రాల్లో ల్యాండ్ లైన్ ఫోన్లను క్రియాశీలం చేసి, కంట్రోల్ రూం ల ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ ప్రతి శాఖ నుండి విపత్తు నిర్వహణకు ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. స్థానిక అధికారులు, నాయకులకు అవగాహన కల్పించి, అత్యవసర సమయాల్లో ప్రజలకు చేసే సేవల్లో అంతరాయం కలగ కుండా చూడాలన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు.