ముద్ర, సూర్యాపేట జిల్లా:
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఎంత ముఖ్యమో ప్రాక్టికల్‌గా చూపిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ ఆదర్శంగా నిలిచారు. మునగాల మండలంలోని మాంటిస్సోరి పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరుగు ప్రయాణంలో వారు కారు ఎక్కగానే సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుండి రక్షణ పొందవచ్చని వివరించారు.
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.
విద్యార్థుల్లోనే రోడ్డు భద్రతపై అవగాహన పెంచితే వారు తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా పాఠశాలల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మంచి ఫలితాలను ఇస్తుందని తెలిపారు.
సీట్ బెల్ట్ ధరించడం, హెల్మెట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదు వంటి ప్రాథమిక నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.