- కొత్త భూమి హక్కుల చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాకే అన్ని మండలాల్లో అమలు చేస్తాం.
- హయత్ నగర్ రెవెన్యూ అవగాహన సదస్సుల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి.
- ధరణి’ ఇబ్బందులు ఉండవని.. రైతులకు ఎంతో ప్రయోజనం.
- సరూర్ నగర్ రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచన.
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.బుధవారం రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం-2025 ను ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి (భూమి హక్కుల చట్టం) తీసుకురావడం జరిగిందని తెలిపారు.ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని సూచించారు.వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. భూదార్ కార్డుల జారీ, రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని అన్నారు.సాదా బైనామాలు, వారసత్వంగా వచ్చిన భూములపై 30 రోజుల్లోగా విచారణ చేయడం జరుగుతుందని, ఒకవేళ అట్టి గడువులోగా విచారణ చేయని పక్షంలో రిజిస్ట్రేషన్ అయినట్లుగా భావించవచ్చని తెలిపారు.ప్రజలు ఈ చట్టం పై అవగాహన ఏర్పర్చుకోవాలని, వారికి ఉన్న భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం మే మొదటి వారం నుండి గ్రామాలలో సదస్సులు నిర్వహించేందుకు వచ్చే అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని సూచించారు.


- కొత్త ఆర్వోఆర్ చట్టంతో ధరణి సమస్యలు ఉండవు : జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్.
సరూర్ నగర్ మున్సిపల్ వార్డులో నిర్వహించిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని రైతులకు భు భారతి చట్టంలోని కీలక అంశాల గురించి పవర్ అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ధరణి సమయంలో రైతులు భూ సమస్యలకు చాలా ఇబ్బందులు పడేవారని అట్టి సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తెస్తే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉండేవారని గుర్తు చేశారు.ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతి చట్టం-2025 ద్వారా రైతులకు సులభతరమైన న్యాయమైన సేవలు అందిస్తామన్నారు. రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు అడిగిన ప్రశ్నలకు అదనపు కలెక్టర్, కలెక్టర్ సమాధానాలు ఇవ్వడం జరిగినది.ఈ సదస్సులలో కందుకూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, స్థానిక అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

