- అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తాం.
- రైతు పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా.
- రైతుల కోసం ప్రతి ఏటా రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.
- కాంగ్రెస్ కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం.
- బీఆర్ఎస్ నేతలు పదేళ్లు పంట నష్టం పరిహారం గురించి పట్టించుకోలేదు.
- దయ్యాలు విక అట్టహాసం చేస్తున్నాయి.. వాటిని ఊరి పొలిమేరలోకి రాకుండా తరిమి కొట్టండి.
- రైతు నేస్తం సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే తొమ్మిది రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా రైతులందరీ బ్యాంకు ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు మొత్తం జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రైతు నేస్తం సభలో సీఎం రేవంత్ రెడ్డి మీటనొక్కగానే రైతు ఖాతాల్లోకి టింగ్ టింగ్ మంటూ రైతు భరోసా నిధులు జమ అవుతాయని ఆయన వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అన్న భట్టి.. రాష్ట్రంలోని సాగు యోగ్యమైన, రైతన్నలు సాగు చేసుకుంటున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్ని ఎకరాలు సాగు చేస్తే ఆ మొత్తం ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ అవుతాయి, ఎలాంటి లిమిట్ లేదు అన్నారు. రాష్ట్రంలో సాగులో ఉన్న 1.49 కోట్ల పైబడి ఎకరాలకు ఎకరాలకు రూ. 12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయన్నారు. భూమిలేని నిరుపేదలు వారు వ్యవసాయ కూలీలుగా ఉంటూ రైతుల పక్షాన నిలబడుతున్న పేదలకు కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ. 12వేల చొప్పున ప్రజాప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పైసా, పైసా పోగుచేసి ప్రజా ప్రభుత్వం రైతులు, రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. రైతుల కోసం ప్రతి ఏటా రూ.70 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో మొత్తం రూ. 3.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల కోసం ఈ ప్రభుత్వం నిటారుగా నిలబడిందని చెప్పారు. ఇటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు అరచేతిలో పెట్టుకొని ఆశీర్వదించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తుంటే బీఆర్ఎస్ నేతలు తమ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. వారు దయ్యాలు అని ఆ పార్టీ నేతలే చెప్పారనీ ఆ దయ్యాలు నేడు విక అట్టహాసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దయ్యాలు ఊర్లో ఉంటే అరిష్టమన్నారు. ఆ దయ్యాలను ఊరి పొలిమేరలోకి రానివ్వకుండా తరిమికొట్టాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రైతులు సుభిక్షంగా ఉండి.. పంటలు పచ్చగా పండాలన్నారు. రాబోయే రోజుల్లో రైతన్నలు ఆనందంగా ఉండేందుకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలకు విడదీయరాని అనుబంధం ఉందని భట్టి చెప్పారు. ఉచిత కరెంటు, రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, మద్దతు ధరకు తో పాటు సన్నధాన్యం సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. ఎవరు ఊహించని విధంగా గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి ఆపకుండా రైతు సోదరుల కోసం అనేక కొత్త పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నాలుగు నెలల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద రూ. 21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామనీ ఇంతటి గొప్ప సాహసం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. గత పాలకులు వెళ్లేముందు రైతు భరోసా వదిలేసి వెళ్లిపోతే క్యాబినెట్లో తీర్మానం చేసి రైతు భరోసా కింద రూ. 13,088 కోట్లు జమ చేసినట్లు భట్టి తెలిపారు. సన్నధాన్యం సాగుచేసిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ కింద రూ. 1,199 కోట్లు విడుదల చేశామన్నారు. పంట నష్టం కింద రూ. 260 కోట్లు, రైతుల ఇన్సూరెన్స్ కోసం రూ. 2,181 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు రాష్ట్రంలోని 29 లక్షల పంపుసెట్లకు ఉచితంగా 24 గంటల కరెంటు సరఫరాకు రూ. 16,691 కోట్లు ఆర్థిక శాఖ నుంచి విద్యుత్ శాఖ అధికారులకు చెల్లింపులు చేస్తుందని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు రూ. 11 వేల కోట్లు ఖర్చు చేసినట్టు భట్టి తెలిపారు.
