- పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపండి.
- పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయండి.
- పహల్గామ్ ఉగ్రదాడికి గట్టి సమాధానం ఇద్దాం.
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పార్టీలు, మతాలకతీతకంగా ఏకమవుదాం.
- ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు తెలంగాణ సానుభూతి.
- టీపీసీసీ ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన.
- పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదొద్దీన్ ఓవైసీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలపాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. ఉగ్రవాదాన్ని పెట్టిపోషిస్తోన్న పాకిస్ధాన్ ను రెండు ముక్కలుగా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు.కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రమూకలు సృష్టించిన మారణహోమాన్ని ఖండించిన సీఎం..ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పహల్గాంలో దాడికి నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన దేశవ్యాప్తంగా శాంతి ర్యాలీ పిలుపులో భాగంగా టీపీసీసీ శుక్రవారం హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించింది. హైదరాబాద్ లో జరుగుతోన్న రైజింగ్ భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ ప్రతినిధులతో కలిసి పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్, ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధనలు చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పర్యాటకులపై దాడి చేసి చంపడం తీవ్రమైన ఘటన అన్నారు. అందరం ఒక్కటై తీవ్రవాదంపై పోరాడాలన్నారు. భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది అన్నారు.ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సానుభూతి తెలిపారు.ఆయా కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోధైర్యాన్ని ఇద్దామని పిలుపునిచ్చారు. 1967, 1971 లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని సీఎం తెలిపారు.ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేశారు.ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారని గుర్తు చేశారు.ప్రధాని మోడీ దుర్గామాత భక్తులుగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకుని ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలన్నారు.ఈ విషయంలో కోట్లాది భారతీయులంతా మోడీకి మద్దతుగా ఉంటారన్నారు.ఒక్క దెబ్బతో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపాలన్నారు.ఈ కార్యక్రమంలో భారత్ సమ్మిట్ కు విచ్చేసిన విదేశీ ప్రతినిధులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రబాకర్, ఎంపి అసదొద్దీన్ ఓవైసీ, ఏఐసీసీ అగ్రనేత సల్మాన్ ఖుర్షీద్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ విజయశాంతి, నగర మేయర్ విజయలక్ష్మీ, మాజీ ఎంపీ అజారొద్దీన్, వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు.
- ఉగ్ర ఘాతుకంపై భారత్ సమ్మిట్ దిగ్భ్రాంతి
పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పై భారత్ సమ్మిట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.హైదరాబాద్ లో శుక్రవారం ప్రారంభమైన సదస్సులో పాల్గొన్న వంద దేశాలకు చెందిన ప్రగతిశీల పార్టీలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.ఇందులో పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పట్ల తాము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పారు.శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదని అభిప్రాయపడ్డారు.ఈ క్రూర దాడులు ఐక్యత, శాంతి, సామరస్యం అనే రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు.ఉగ్ర దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారపీ అనేక మంది గాయపడ్డారన్నారు.భారత ప్రజలకు తాము సంఘీభావాన్ని తెలిపారు. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
