Take a fresh look at your lifestyle.

తెలంగాణలో రాజ్యసభ ఏకగ్రీవం..? కాంగ్రెస్ ఖాతాలోనే రెండు స్ధానాలు

కాంగ్రెస్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
స్వతంత్ర అభ్యర్ధిగా సాయి నామినేషన్
పది మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండానే సాయి నామినేషన్ దాఖలు
స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యే అవకాశం
ఖర్గే, రాహుల్, సోనియాకు కాంగ్రెస్ అభ్యర్ధుల కృతజ్ఞతలు

పోటీకి దూరంగా బీఆర్ఎస్

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ స్థానాల ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగియగా.. మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తరఫున సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ సింఘ్వీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా స్వతంత్ర అభ్యర్థిగా సాయి అనే వ్యక్తి నామినేషన్ వేశారు. అభిషేక్‌ సింఘ్వీ మూడుసెట్లు, వేం నరేందర్‌రెడ్డి నాలుగు సెట్లు, సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థి 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా నామినేషన్ వేయడంతో స్క్రూటినీలో అది తిరస్కరణకు గురి కానుంది. దీంతో సింఘ్వీ, వేం నరేందర్ ఏకగ్రీవం లాంఛనం కానుంది. అంతకు ముందు ఏఐసీసీ ముఖ్య ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్‌రెడ్డి గురువారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి తమ నామినేషన్ సెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణుల కోలాహలంతో అసెంబ్లీ ప్రాంగణం సందడిగా మారింది. నామినేషన్ అనంతరం అభ్యర్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ తరఫున రెండోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదీలావుంటే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం నామినేషన్లు గత నెల 26న మొదలయ్యాయి. ఈ నెల 6న అధికారులు అన్ని నామినేషన్లు పరిశీలిస్తారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 9 వరకు అవకాశం ఉంది. ఏకగ్రీవం కాని పక్షంలో అవసరమైతే ఈ నెల 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

 

బీఆర్ఎస్ కు ఎదురుగాలి :
పదేళ్లు తెలంగాణలో ఏకచత్రాధిపత్యం కొనసాగించిన బీఆర్ఎస్ కు క్రమంగా ఎదురుగాలి వీస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఖాళీ అయిన రెండు స్థానాల్లో సురేశ్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కాగా తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోనుంది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సంఖ్యా బలం లేకపోవడంతో బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.

Leave A Reply

Your email address will not be published.