Take a fresh look at your lifestyle.

తెలంగాణ రాజకీయాల్లో కొత్త దృశ్యం: కాంగ్రెస్ ఆధిక్యత, బీఆర్ఎస్ బలహీనత

మళ్లీ బ్యాక్ స్టెప్
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజ్యసభ ఎన్నికల జోరు
పోటీకి దూరంగా బీఆర్ఎస్!
ఇటీవల వరుసగా ఇదే తీరు
ముందుగా పోటీ అంటూ ప్రకటనలు
దీంతో అశల్లో అభ్యర్థులు
చివరకు వెనకడుగు వేస్తున్న గులాబీ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి మేకపోతు గాంభీర్యంగా మారింది. ఎన్నికలైనా.. ఎజెండా ఏదైనా ముందుగా మేమే చేస్తాం అంటూ చెప్పుకురావడం.. చివరకు చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పరువు తియ్యాలని బీఆర్ఎస్ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. పరిస్థితులు ఆ పార్టీకే కలిసొస్తున్నాయి. మొన్నటి మున్సిపల్ ఎన్నికల తర్వాత మరోసారి కాంగ్రెస్‌లో రాజ్యసభ ఎన్నికల సందడి కనిపిస్తోంది.

అనుకున్న రాజకీయమే..
ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగుంటుంది. ఒక్కసారి పవర్ పోతే.. గాలి తీసిన బెలూన్‌లా అయిపోతాయి పార్టీలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అలాగే తయారైంది. పదేళ్లపాటూ అధికారంలో ఉండి.. చాలా ఎన్నికల్లో అవలీలగా గెలిచిన బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్‌కి కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది. రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. మరోవైపు, అత్తెసరు సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం జరిగే ప్రతి ఎన్నికలోనూ పాజిటివ్ ఫలితాలు తెచ్చుకుంటూ ముందుకి వెళ్తోంది. తాజాగా రాజ్యసభ స్థానాల విషయంలోనూ ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపుతూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కి షాక్ ఇస్తోంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్ తరపున ఇద్దరు రాజ్యసభ సీట్లకు నామినేషన్ వేశారు. పార్టీ హైకమాండ్.. సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీకి రెండోసారి అవకాశం ఇచ్చింది. ఆయన ఇప్పటికే ఒకసారి రాజ్యసభకు ఎన్నికై అనుభవశీలిగా మారారు. ఈసారి కూడా కాంగ్రెస్ ఆయన అనుభవాన్నీ, జాతీయ స్థాయి గుర్తింపునూ దృష్టిలో ఉంచుకుని రెండో అవకాశం కల్పించింది. దీనిపై రాజస్థాన్‌కి చెందిన అభిషేక్ మను సింఘ్వీ పార్టీకి ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు. ఇక మరో అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన స్థితిలో ఉండటంతో ఈ ఇద్దరు నామినేషన్లూ పార్టీ బలాన్ని స్పష్టంగా చాటుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో కాంగ్రెస్ ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి ఇది సహాయపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్ఎస్ సంగతి ఏంటి?:
ఏ ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం అని కేటీఆర్ తరచూ అంటున్నారు. ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ బలపడుతోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి కంటే ఇప్పుడు మరింత ఎక్కువ కాన్ఫిడెన్స్‌తో ఉంది. మరోవైపు ప్రజలతో తరచుగా కలవని కేసీఆర్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉంటూ అక్కడి నుంచే రాజకీయ వ్యవహారాలు చూస్తుంటే.. ఫీల్డ్ మీద కేటీఆర్, హరీశ్ రావు జోరుగా ఉన్నట్లు కనిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఆ పార్టీలో కేసీఆర్ ప్రజల మధ్యకు రాని లోటు కనిపిస్తూనే ఉంది. ఎన్నికల్లో ప్రజలు.. ఈ లోటు కారణంగానే.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి.

బలం లేని నిరూపణ
రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీ పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి తగినంత సంఖ్యాబలం లేదు. తెలంగాణ శాసనసభలో ప్రస్తుతం బీఆర్ఎస్‌కు సరిపడా సీట్లు లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్.. ఇప్పుడు కనీసం అభ్యర్థులను పోటీకి పెట్టలేని పరిస్థితిలో ఉంది. దీని వల్ల బీఆర్ఎస్ బలహీనంగా ఉంది అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లగలవు. అది ఆ పార్టీకి మైనస్ అవ్వగలదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంటే.. ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తున్న బీఆర్ఎస్ అప్పటికీ ఆ పొజిషన్‌ని కాపాడుకుంటే.. అప్పుడు ప్రజలు బీఆర్ఎస్ వైపు చూసే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ పాలనపై ఇది ఆధారపడి ఉంటుంది. హస్తం పాలన బాగానే ఉంటే.. ప్రజలు మళ్లీ ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చు. లేదంటే.. అసలు ఈ పార్టీలను కాదని బీజేపీ వైపు చూడొచ్చు. లేదా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అధికారంలోకి రావచ్చు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ రెండు సీట్లు సురక్షితంగా సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుండగా, బీఆర్ఎస్ తన బలహీనతను బయటపెడుతున్నట్లవుతోంది. రాజ్యసభ ఎన్నికలు జాతీయ రాజకీయాలపై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

పోటీ పేరుతో ఆశావాహుల ఆశ
బీఆర్ఎస్ నుంచి ఎవరో ఒకరిద్దరు ఇలాంటి స్థానాల కోసం ఆశలు పెట్టుకోవడం సాధారణమే. తాము పోటీ చేస్తామని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని, తమకు ఓట్లు పడుతాయని, తామూ గెలుస్తామంటూ బీఆర్ఎస్ పదేపదే చెప్పుకురావడంతో.. పలువురు ఆశావాహులు ఆశల్లో పడుతున్నారు. కానీ, చివరి వరకూ ఊహించిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఆఖరుకు చేతులెత్తేస్తోంది.

కేడర్ కు ఏం చెప్తారు..?
పోటీ నుంచి తప్పుకోవడం అలవాటుగా చేసుకున్న బీఆర్ఎస్.. ఇప్పుడు తమ కేడర్ కు ఏం చెప్తుందనేది ముందున్న చర్చ. ఎందుకంటే ప్రస్తుతానికి పార్టీ బాస్ లు మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నారు. తమ బలం ఏమిటో వాళ్లకు తెలుసు. కానీ, తమకే బలమంటూ చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో మాత్రం బోల్తా పడుతున్నారు. ఇప్పటికే పార్టీ కేడర్ చాలా ఆయోమయంలో ఉంది. ఇలాంటి పరిస్థితి మరింతగా కుంగదీసే అవకాశాలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.