Take a fresh look at your lifestyle.

అమీర్ పేటలో అగ్నిప్రమాదం

షార్ట్ సర్క్యూట్ తో మైత్రివనం నీలగిరి బ్లాక్‌లో మంటలు
మంటల్లో చిక్కుకున్న 200 మంది విద్యార్ధులు
సురక్షితంగా బయటికి తీసుకువచ్చిన పోలీసులు
ముద్ర, హైదరాబాద్ : 
అమీర్‌పేటలోని మైత్రివనం ఏరియాలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. మైత్రివనం భవనం పక్కనే ఉన్న నీలగిరి బ్లాక్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెక్కలకు నిప్పు అంటుకోవడంతో మంటలు, పొగలు వ్యాపించాయి. దీంతో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌‌లకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. మెట్ల మార్గంలో దట్టమైన పొగ అలుముకోవడంతో వారు కిందకు దిగడానికి వీలులేకుండా పోయింది. బాల్కనీలోకి వెళ్లిన విద్యార్థులు కిందకు దూకడానికి ప్రయత్నించారు. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ సీఐ సంజీవ్ వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సమీపంలో ఉన్న షాపులో నుంచి నిచ్చెన తీసుకొచ్చారు. హోంగార్డ్స్, ప్రజల సాయంతో 80 మంది వరకు విద్యార్థులను సురక్షితంగా కిందకు దించారు. రెస్క్యూ తర్వాత ప్రమాద ఘటపై జూబ్లీహిల్స్ డీసీపీ రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమకు సమాచారం అందిన వెంటనే అందర్నీ అప్రమత్తం చేశామన్నారు. ఇన్‌‌స్టిట్యూట్‌లోని 200 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపించామని చెప్పారు. ఈ భవనంలో 6-7 అంతస్థులు ఉండగా.. 2, 3 అంతస్థుల్లో పొగ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించిందన్న ఆయన.. విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు పంపించామని తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయన్నారు.
ఐటీ కోచింగ్ సెంటర్లకు కేరాఫ్
అమీర్‌పేటలోని మైత్రివనం ఐటీ కోచింగ్ సెంటర్లకు పెట్టింది పేరు. బీటెక్, ఎంసీఏ లాంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు.. మరిన్ని కోర్సులు నేర్చుకోవడం ద్వారా ఉద్యోగావకాశాలను మెరుగపర్చుకోవడం కోసం మైత్రివనంలోని కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం శిక్షణ పొందుతుంటారు. నిత్యం యువతతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో విద్యార్థులతోపాటు సొంత ఊళ్లలోని తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. అయితే విద్యార్థులంతా క్షేమంగా బయటకు వచ్చారని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందగానే సనత్‌నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైదరాబాద్ నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎల్బీనగర్‌ చట్నీస్‌ లో పేలిన ఇడ్లీ స్టీమర్‌..
ఎల్బీనగర్‌లోని ఆర్కేపురం చట్నీస్‌ హోటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. భారీ శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు హోటల్‌ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడిమి కారణంగానే స్టీమర్‌ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్‌ బృందాలు పేలుడు సంభవించిన కిచెన్‌ను పరిశీలించాయి. ఇడ్లీ స్టీమర్‌  వేడెక్కడంతోనే పేలుడు సంభవించిందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
===============

Leave A Reply

Your email address will not be published.