ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణ గిరి దివ్య క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి గురువారం తిరుప్పావడ సేవ ఘనంగా నిర్వహించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారని ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు తెలిపారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంద ని అప్పుడు సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని, లడ్డు, వడ, తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారని చెప్పారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూరమంగళ హారతులు సమర్పించారు.
స్వామి వారికి ప్రాతఃకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను భక్తిశ్రద్ధలతో విశేషంగా నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని భక్తులకు కల్పించారు.