Take a fresh look at your lifestyle.

ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ కఠిన ఆదేశాలు సమన్వయ చర్యలతో అరికట్టే దిశగా చర్యలు – రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఇసుక తవ్వకాలు, రవాణా జరగాలని స్పష్టం చేశారు.

గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇసుక తవ్వకాల అనుమతులు, రవాణా, ప్రభుత్వ ఆదాయం పెంపు, అక్రమ తవ్వకాల నియంత్రణపై సమగ్రంగా చర్చించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇసుక బుకింగ్ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో “మన ఇసుక వాహనం” యాప్ ద్వారానే జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫ్‌లైన్ బుకింగ్‌కు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

జిల్లాలోని పలు మండలాల్లో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల దరఖాస్తులను పర్యావరణ అనుమతుల ఆధారంగా పరిశీలించి, తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే రవాణా జరగాలని సూచించారు. ఇసుక తరలింపుకు దరఖాస్తు చేసిన వాహనాల ద్వారానే రవాణా జరగాలని, వాహనాల వివరాలు, డ్రైవర్ లైసెన్స్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.

గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు లేదా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే పోలీస్ శాఖ సహాయం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఇటీవల ఇసుక రీచ్‌ల వద్ద నిర్వహించిన తనిఖీలలో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని, ఇసుక సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఆఫ్‌లైన్ విధానంలో ఇసుక రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణ, నీటిపారుదల శాఖ అధికారి మురళి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు, భూగర్భ జల శాఖ అధికారి దివ్య జ్యోతి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.