- పెట్టుబడులే కాదు.. పరస్పర సహకారం ముఖ్యం.
- అందుకే జపాన్ పర్యటన.
- శాంతి, స్థిరత్వం, సమృద్ధి వంటి విలువలను పంచుకుందాం.
- కలిసికట్టుగా సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం.
- తెలంగాణలో 50కిపైగా జపాన్ కంపెనీలు.
- రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటి, మ్యానుఫాక్షరింగ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో గొప్ప అవకాశాలు.
- హిరోషిమా, హైదరాబాద్, జపాన్ మధ్య బలమైన సంబంధాల వారిధిని నిర్మిద్దాం.
- హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబు బృందం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : శాంతితో పాటు సాంకేతిక పురోగతిలో హిరోషిమా ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.తెలంగాణ కూడా కొత్త ఆవిష్కరణలు, సుస్థిర విధానాలు, శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉందని వెల్లడించారు.శాంతి, స్థిరత్వం, సమృద్ధి వంటి విలువలను పంచుకుందామని పిలుపునిచ్చారు. ఇరు దేశాలు కలిసికట్టుగా సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దామని చెప్పారు.జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందం మంగళవారం అక్కడి హిరోషిమా ప్రి ఫెక్చర్ (రాష్ట్ర ప్రభుత్వం) ను సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ బృందం సభ్యులు హిరోషిమా డిప్యూటీ గవర్నర్‌తో సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ, హిరోషిమా కలిసి పని చేయగలిగే రంగాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీల్లో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగు నీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా- తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను ప్రస్తావించారు. వీటితో పాటు విద్య, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి, పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్ధ వారసత్వానికి సహకరించాలని కోరారు.
- హిరోషిమా అసెంబ్లీని సందర్శించిన రేవంత్ టీమ్ :
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని “తెలంగాణ రైజింగ్” బృందం మంగళవారం జపాన్‌లోని హిరోషిమా ప్రిఫెక్చర్‌ను సందర్శించింది.హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ హాల్ సందర్శనకు వెళ్లిన బృందానికి అసెంబ్లీ స్పీకర్ తకాషి నకమోటో, వారి శాసనసభ్యుల బృందం ఘనంగా స్వాగతించింది. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు జయేష్ రంజన్, వి. శేషాద్రి, అజిత్ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి అసెంబ్లీని సందర్శించారు. శాసనసభ్యుల సమావేశాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హిరోషిమాకు రావటం గౌరవంగా ఉందన్నారు. హిరోషిమా అంటే ఆశ అనీ ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమని ప్రపంచానికి నిరూపించిన నగరం అన్నారు.హిరోషిమా మాదిరిగానే ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, పోరాటానికి తెలంగాణ చిహ్నమనీ దూరదృష్టితో విజయం సాధించిన రాష్ట్రం అని చెప్పారు.మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ శాంతి, స్థిరత్వం, సమృద్ధి వంటి విలువలను పంచుకుందామని అక్కడి ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. పెట్టుబడులకు కాకుండా పరస్సర సహకారం, భాగస్వామ్యం గురించి మాట్లాడటానికి వచ్చామని, కలిసికట్టుగా మెరుగైన, పచ్చని, సమగ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దామని అన్నారు.ఇప్పటికే యాభైకి పైగా జపాన్ కంపెనీలు తెలంగాణలో అద్భుతంగా పనిచేస్తున్నాయని, మరిన్ని కంపెనీలను మంత్రి స్వాగతించారు.క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ప్రిసిసన్ మ్యానుఫాక్చరింగ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో గొప్ప అవకాశాలున్నాయని అన్నారు.తలంగాణను సందర్శించి, రాష్ట్ర ప్రగతిని స్వయంగా చూడాలని హిరోషిమా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణ దేశానికి గేట్ వేగా.. ప్రపంచానికి విస్తరించే వేదికగా ఉంటుందని అన్నారు.హిరోషిమా- హైదరాబాద్, జపాన్ -తెలంగాణ మధ్య బలమైన సంబంధాల వారధిని నిర్మిద్దామని కోరారు.అసెంబ్లీ సందర్శన తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం హిరోషిమా చాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులతో సమావేశమయ్యారు.అనంతరం, శాసనసభ్యుల బృందం రేవంత్ రెడ్డి బృందాన్ని గాంధీ మెమోరియల్, హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అణుబాంబు డోమ్‌ల వద్దకు తీసుకెళ్లింది.