మొదటి రోజు 99.42 శాతం హాజరు
పరీక్ష కేంద్రాలు సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
ముద్ర ప్రతినిధి మెదక్:
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 99.42శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 6660 కు 6622 విద్యార్థులు హాజరుకాగా 38 మంది గైర్హాజరయ్యారు.
మండల కేంద్రం కొల్చారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది పరిశీలించారు. సీసీటీవీ నిఘా మధ్య ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించారు.

పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, మెడికల్ కిట్‌తో ఏఎన్‌ఎం అందుబాటులో ఉండటం, టాయిలెట్ వసతులు వంటి మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు. అనవసర గుంపులు ఏర్పడకుండా చూడాలని, సెల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.