సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి 25
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం పరీక్షల తొలి రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, షాహిన్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈసందర్భంగా పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలను తెరిచారా లేదా అన్నది పరిశీలించారు. సీసీటీవీ నిఘా మధ్య ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, మెడికల్ కిట్‌తో ఏఎన్‌ఎం అందుబాటులో ఉండటం, టాయిలెట్ వసతులు వంటి మౌలిక సదుపాయాలను కూడా పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పరీక్షలు పూర్తైన వెంటనే ఆన్సర్ షీట్లను తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని సూచించారు. ఎలాంటి కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈతనిఖీలో సంబంధిత పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మరియు అధికారులు పాల్గొన్నారు.