ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
జోగులాంబ గద్వాల్ జిల్లాలో రోడ్డు భద్రతపై అరుదైన చైతన్య తరంగం ఉద్ధృతమైంది. శుక్రవారంగద్వాలలోని వజ్రా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమం కేవలం అవగాహన సమావేశం కాదు… ప్రాణాలను కాపాడే ప్రజా ఉద్యమంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న “99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు వేదికపై నుంచి ఇచ్చిన సందేశం సభను కదిలించింది — “నా గ్రామంలో యాక్సిడెంట్ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు… ఇది ప్రతి సర్పంచ్ తీర్మానంగా మారాలి” అని గట్టిగా పిలుపునిచ్చారు.

ఆయన మాటల్లో స్పష్టత, ఆవేదన, బాధ్యత స్పష్టంగా ప్రతిబింబించాయి. గ్రామాల్లో హెల్మెట్ వినియోగాన్ని కచ్చితంగా అమలు చేయాలని, చిన్న వయస్సులో ట్రాక్టర్లు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. “చిన్న నిర్లక్ష్యం పెద్ద విషాదానికి కారణమవుతుంది” అని హెచ్చరించారు.
“గోల్డెన్ అవర్” ప్రాముఖ్యతను వివరిస్తూ — ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితుడిని ఆసుపత్రికి చేర్చితే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. బాధితులను ఆసుపత్రికి తరలించే వారికి ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసి ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్” గురించి వివరిస్తూ — ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి చేర్చిన వారికి ₹25,000 ప్రోత్సాహకం, బాధితుడి చికిత్సకు ₹1.5 లక్షల వరకు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది —
ఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా వేదికపై సీపీఆర్ (CPR) ప్రదర్శించడం. ఒక ఉన్నతాధికారి స్వయంగా ప్రాణరక్షణ విధానాన్ని చూపించడం పాల్గొన్న వారిని ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు స్ఫూర్తినిచ్చింది.
వైద్య నిపుణులు రాజు, షఫీ, అభినేష్ ల బృందం ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను ప్రాక్టికల్‌గా వివరించారు. శ్వాస మార్గాలను సరిచేయడం, రక్తస్రావాన్ని అదుపులో పెట్టడం, వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడం, సీపీఆర్ విధానం వంటి అంశాలను స్పష్టంగా తెలియజేశారు. సభలో పాల్గొన్న సర్పంచులు, యువత ఈ శిక్షణను ఆసక్తిగా స్వీకరించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ వై. మొగులయ్య మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల పాత్ర అత్యంత కీలకమని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ టంగుటూరు శ్రీను మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచి అవగాహన పెంపొందితేనే నిజమైన మార్పు వస్తుందని సూచించారు. కార్యక్రమాన్ని సమన్వయం చేసిన ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ, “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రజల్లో ప్రాణ భద్రతపై స్థిరమైన అవగాహన కల్పించడమే లక్ష్యమని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్‌కు ఎవరూ రావద్దని స్పష్టం చేశారు.
గద్వాల్ రూరల్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిఎస్పీ వై. మొగులయ్య, సిఐ టంగుటూరు శ్రీను, గ్రామ సర్పంచులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.