ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్: పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎండల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాటసారులు, కార్మికులు, సాధారణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. వేసవి కాలం ముగిసే వరకు నిరంతరాయంగా తాగునీరు అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.
అలాగే పక్షుల దాహార్తి తీర్చేందుకు మట్టి పాత్రల్లో నీటిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు కూడా తమ ఇళ్ల ఆవరణల్లో, మేడలపై పక్షుల కోసం నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. “ప్రకృతికి మనం.. మనకు ప్రకృతి” అనే సందేశంతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమానికి స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.