Take a fresh look at your lifestyle.

చెరువులు.. కుంటలు.. హాంఫట్…!

– పాలమూరు లో చెరువులు.. కుంటలు కబ్జాలు
– బఫర్ జోన్.. ఎఫ్ టీ ఎల్ పరిధిలో రియటర్ల భూ దందా
– బీ ఆర్ ఎస్ పరిధిలో విచ్చలవిడిగా చెరువులు, కుంటల ఆక్రమణ
– వీటిని కాపాడడం లో విఫలం అవుతున్న ప్రస్తుత అధికారులు
– ప్లాట్లుగా మార్చి విక్రయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు
– ఏనుగొండ జాతీయ రహదారి పక్కన ఉన్న మోదుగుంట చెరువే సాక్ష్యం
– చెరువును చెరబట్టి జోరుగా రియల్ వ్యాపారం
– ప్రజావాణి కలెక్టర్ కు, సంబంధిత అధికారులకు చెరువుల సంరక్షసమితి సభ్యుల ఫిర్యాదు
– అయినా చర్యలు తీసుకోని అధికార యంత్రాంగం
………………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………..
పాలమూరు లో బీ ఆర్ ఎస్ పార్టీ పదేళ్ల కాలంలో లో చెరువులు, కుంటలు అక్రమార్కుల చేతుల్లో బందీ అయిపోయాయి. భూ కబ్జా రాయుళ్ల ను అడ్డుకునేందుకు ఏ అధికారి ముందుకు రాలేదు.

ఒక వేల సిన్సియర్ అధికారి చర్యలకు ముందుకు వస్తే అతని పై వేధింపులు, ట్రాన్సఫర్లు. అందుకే జిల్లా అధికారులు తమకేమి పట్టనట్లు ప్రభుత్వ చెరువు లే కదా మనం ఇబ్బందులు ఎందుకు పడదామని కుర్చీలకే పరిమితం అయ్యారు. దీంతో భూ కబ్జా రాయుళ్ళు మరింత చెలరేగి పోయి పాలమూరు పట్టణ సమీపంలో ని చెరువులు, కుంటలను చెరబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో రూ.కోట్లు కొల్లగొట్టి నీటి వనరులు లేకుండా పూర్తిగా నాశనం చేశారు. వీరికి అప్పటి ఓ కలెక్టర్ కూడా అండగా ఉంటూ వచ్చారు. ఆ కలెక్టర్ పై తీవ్ర మైన ఆరోపణలు రావడం తో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అప్పటి బీ ఆర్ ఎస్ పార్టీ పాలమూరు నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టి ఆ కలెక్టర్ ను ఇక్కడి నుంచి బదిలీ చేశారు.అప్పట్లో ఈ అక్రమాల పై పిర్యాదు చేసేందుకు కూడా బయపడేవారు. దీంతో పాలమూరు లో ఇలా చాలా చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి.ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది.ప్రస్తుతం చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు కాపాడేందుకు నడుం బిగించారు. వీటిని కాపాడాలని జిల్లా కలెక్టర్ కు ప్రతి ప్రజావాణి లో నేరుగా కలిసి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. అయినా ఇంకా ఫలితం మాత్రం కనిపించడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడం తో జిల్లాలో చెరువులు క్రమంగా మాయవుతున్నాయి. ఏళ్లుగా ప్రజలకు జీవనాధారంగా నిలిచిన చెరువులు ఇప్పుడు ఆక్రమణల బారిన పడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, రియల్ ఎస్టేట్ ఒత్తిళ్లు కలిసి చెరువుల ఉనికినే ప్రమాదంలోకి నెట్టుతున్నాయి.జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెరువుల భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న చెరువుల పరిమితులు ప్రస్తుత స్థితిలో కనిపించడం లేదని చెరువు సమీప ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు.


కొన్ని చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురై ఆనవాళ్లు లేకుండా పోయాయి.ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్‌లకు విరుద్ధంగా గృహ నిర్మాణాలు, లేఅవుట్లు వేగంగా పెరుగుతున్నాయి. బఫర్ జోన్‌లను పూర్తిగా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇది భవిష్యత్తులో భారీ వరదల ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని నీటిపారుదల నిపుణులు హెచ్చరిస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువుల భూములపై కన్నేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
చెరువుల ఆక్రమణలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని బాధితులు చెబుతున్నారు. చెరువుల రక్షణ కోసం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖలు కేవలం చూస్తూ ఉండిపోతున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
జిల్లాలోని అనేక చెరువులు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల చెరువుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చెరువుల ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
చెరువులపై జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించాలి ఎఫ్ టి ఎల్,బఫర్ జోన్‌లను స్పష్టంగా గుర్తించాలి
పూర్తి స్థాయి సర్వే నిర్వహించి చెరువుల అసలు సరిహద్దులను పునరుద్ధరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చెరువులు కేవలం నీటి వనరులు మాత్రమే కాకుండా భూగర్భ జలాల అభివృద్ధి కి , పర్యావరణ సమతుల్యతకు కీలకం. ఇవి నశిస్తే భవిష్యత్తులో తాగునీటి కొరతతో పాటు పర్యావరణ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని అధికారులు గ్రహించాల్సిన అవసరం ఉంది. విటిని కాపాడకుంటేభవిష్యత్తులో చెరువులు, కుంటలు చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
…………………………………….
మోదుగుంటలో 20 ఎకరాల భూమికి ఎసరు :
…………………………………….
పాలమూరు పట్టణ నడిబొడ్డున లోని ఏనుగొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోదుగుంట చెరువు భూములపై భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి. చెరువు శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలోని భూములను రియాల్టర్లు 20 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.ఈ చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్లు 294, 292, 296, 298, 295 402 ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉండాల్సి ఉంది. అయితే, గతంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి నీటిపారుదల శాఖకు బదిలీ సమయంలో రికార్డులు తారుమారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు పట్టాదారులు కోర్టులను ఆశ్రయించి తమకు అనుకూలంగా తీర్పులు పొందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెరువు విస్తీర్ణం కేవలం ఐదు ఎకరాలకే పరిమితమైందని పేర్కొంటూ మిగిలిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువు మధ్యలో రహదారి కోసం మట్టి నింపడంతో అది రెండు భాగాలుగా విడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే, చెరువు శిఖం ప్రాంతంలోనే గతంలో జేజేఆర్ గార్డెన్ పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టారనే ఫిర్యాదు లు కూడా అధికారులకు వెళ్లాయి.అయినా చర్యలు శూన్యం.ప్రస్తుతం బఫర్ జోన్ లో ఉన్న భూ మిని కూడా ఆక్రమించారు. వీటిలో కొత్త నిర్మాణాలు,కొనసాగుతున్నాయని ఏనుగొండ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిఖం భూములు, బఫర్ జోన్లో నిర్మాణాలు నిషేధమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొందరు రాజకీయ అండ తో కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమించి పట్టాలు పొందుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, చెరువు, కుంటల భూములను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ ముదిరాజ్ సంఘము సభ్యులు మెట్టుగాడి శ్రీనివాస్, మెట్టుగాడి ప్రభాకర్ కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు, సంబంధిత అధికారులు ఆ వైపు దృష్టి పెడతారని ఆశిద్దాం.

Leave A Reply

Your email address will not be published.