ముద్ర : కాప్రా
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ భగాయత్ ప్రాంత అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సహకారం, కృషితో ఉప్పల్ భగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పలుమార్లు సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించిన హెచ్ఎండీఏ అధికారులు మొత్తం రూ.13 కోట్ల నిధులను వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
ఈ నిధులతో కాలనీ అభివృద్ధికి పలు ముఖ్యమైన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా రూ.3.40 కోట్ల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టనుండగా, రూ.9.60 కోట్లతో సుమారు 10 కిలోమీటర్ల మేర బ్లాక్‌టాప్ రోడ్ల నిర్మాణం చేసి రహదారి సౌకర్యాలను మెరుగుపరచనున్నారు.
అదేవిధంగా కాలనీలో చెత్త సమస్యను దృష్టిలో ఉంచుకొని 42 మంది పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా కేటాయించారు, దీంతో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయి.
ఇంకా హెచ్ఎండీఏ లేఔట్లో రైతు బజార్ అభివృద్ధి, సుమారు 8 ఎకరాల పార్కు స్థలానికి కాంపౌండ్ వాల్, వాకింగ్ ట్రాక్, స్ట్రీట్ లైట్స్, పిల్లలు-పెద్దలు వినోదానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే ని కోరారు.
వెస్ట్ సైడ్ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి సరఫరా వంటి సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ నిర్ణయంతో ఉప్పల్ భగాయత్ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి లభించనుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.