– OTS విధాన ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సర్ధార్ రవీందర్ సింగ్
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
ముద్ర, కరీంనగర్ :
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో అమలు చేస్తున్న వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేసి, మిగతా పట్టణాలను విస్మరించడం పట్ల కరీంనగర్ మాజీ మేయర్, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
GHMC పరిధిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలపై మార్చి 31 వరకు 90 శాతం రాయితీతో పాటు 5 శాతం వడ్డీ మినహాయింపు కల్పిస్తూ వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటం స్వాగతించదగ్గ విషయమేనని ఆయన పేర్కొన్నారు. అయితే అదే పథకాన్ని రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తింపజేయకపోవడం తీవ్ర అన్యాయమని విమర్శించారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో సుమారు 85 వేల ఇళ్లకు పైగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని తెలిపారు. GHMCలో అమలు చేస్తున్నట్లే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31 వరకు ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం రాయితీతో పాటు 5 శాతం వడ్డీ మినహాయింపు కల్పిస్తూ వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకాన్ని కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో కూడా అమలు చేస్తే వేలాది కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని అన్నారు.
ఒక నగరానికి మాత్రమే ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ మిగతా పట్టణాలను పక్కన పెట్టడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని సర్ధార్ రవీందర్ సింగ్ విమర్శించారు. “GHMCకు ఒక న్యాయం… కరీంనగర్‌కు మరో న్యాయమా? కరీంనగర్ వేరే రాష్ట్రంలో ఉందా?” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సమాన న్యాయం జరిగేలా GHMCలో అమలు చేస్తున్న OTS పథకాన్ని కరీంనగర్ సహా ఇతర పట్టణాలకు కూడా వెంటనే విస్తరించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంత ప్రజల సమస్యలను ప్రభుత్వం గంభీరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.