ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సీపీ సాధన రష్మీ పెరుమాళ్, ఏసీఎల్బీ అబ్దుల్ రహమాన్, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సభ వేదికపై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో మొదటగా ప్రజలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మూడవ వారంలో అరైవ్ – అలైవ్ లో భాగంగా రహదారి భద్రత పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గొప్ప నాయకుడిగా ఎదగడం ఒక్కరోజులో సాధ్యం కాదని, ఎన్నో కష్టాలను అధిగమిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బంగారం, ఇనుములతో నగలు, వస్తువులు తయారు చేయడంలో ఎంత కఠిన శ్రమ అవసరమో, అదే విధంగా మనం ఉత్తమ వ్యక్తులుగా ఎదగడానికి కృషి చేయాలని సూచించారు.
అంబేద్కర్ సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ, తన సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. భారత రాజ్యాంగంలో పౌరులకు ఉన్నతమైన హక్కులను కల్పించి, అన్ని వర్గాల ప్రజలకు సమాన ఓటు హక్కు అందించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహోన్నత నాయకుడని అన్నారు. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం “భారతరత్న” పురస్కారం అందజేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమాజంలో అందరికీ సమాన గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో, విభిన్న పరిస్థితులలో ఉన్నవారు సమానంగా పోటీపడలేరని భావించి రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన దూరదృష్టి గల నాయకుడు అంబేద్కర్ అని వివరించారు. అందరికీ సమాన విద్యా, ఆరోగ్య అవకాశాలు కల్పించినప్పుడు మాత్రమే రిజర్వేషన్ పై పునరాలోచించాలని, సమాజంలో వివక్ష తగ్గుతుందని అన్నారు. అంబేద్కర్ అనేక చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఆర్థిక రంగంలో కూడా విశేష కృషి చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో ఆలోచనాత్మక మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. సమాన వేతన విధానానికి పునాది వేసిన మేధావి అని కొనియాడారు. ప్రపంచ మేధావులలో గుర్తింపు పొందిన అంబేద్కర్ మన దేశానికి చెందిన వ్యక్తి కావడం గర్వకారణమని పేర్కొంటూ, ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని పోరాట స్ఫూర్తిని ఆచరణలో పెట్టి ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. ఆయన జీవితంలో ఉన్న మంచి విలువలను స్వీకరించి ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుండాలని సూచించారు.
ఏసీఎల్బీ అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ, అంబేద్కర్ జీవితంలో నుంచి ఓర్పు, పట్టుదల, బాధ్యత వంటి గుణాలను అలవరచుకోవాలని తెలిపారు.అనంతరం ఎస్సీ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థిని కళాంజలి ప్రార్థిని (లిటిల్ మిస్ ఇండియా రన్నర్-అప్)ను శాలువాతో సత్కరించారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. అలాగే అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి నగదు బహుమతులు, క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పి. రాములు, సాకీ ఆనంద్, కె. రవీందర్, బయ్యారం ఇస్తారి, లింగంపల్లి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సంఘ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.