Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా సంగారెడ్డి మున్సిపల్ ప్రత్యేక సమావేశాలు

 

  • తొమ్మిది మున్సిపాలిటీల చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక పూర్తి
  • సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అధీకృత అధికారులు
  • జహీరాబాద్, ఇంద్రేశం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా

సంగారెడ్డి, ఫిబ్రవరి 16:-

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు ప్రత్యేక సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం,చైర్ పర్సన్ , వైస్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య మార్గ నిర్దేశంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

సంగారెడ్డి మున్సిపల్ ప్రత్యేక సమావేశం అదీకృత అధికారి జడ్పీ సీఈవో జానకి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఆయా పార్టీల సభ్యులు సమావేశ మందిరాలలోకి చేరుకోగా, తెలుగు అక్షరమాలను అనుసరిస్తూ వరుస క్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో అధీకృత అధికారులు ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎన్నికల ప్రక్రియ మొత్తం నిబంధనల మేరకు, పారదర్శకంగా పూర్తయ్యింది.

జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, అందోల్ –జోగిపేట్, కోహిర్, నారాయణాఖేడ్, ఇస్నాపూర్, గుమ్మడిదల గడ్డపోతారం, జిన్నారం మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి. అయితే జహీరాబాద్, ఇంద్రేశం మున్సిపాలిటీలలో సరిపడా కోరం లేనందున ఆయా మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

మున్సిపల్ కమిషనర్లు, అదీకృత అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది. ఉదయం 11 గంటలకు మొదటగా వార్డు సభ్యులుగా ఎన్నికైన సభ్యులందరికీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు సరి పడు కోరం ఉందని నిర్ధారించుకున్న మీదట ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు.చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించి, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లను అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మున్సిపాలిటీ వారీగా చైర్మన్, వైస్ చైర్మన్‌ల వివరాలు:

ఆందోల్- జోగిపేట్ మున్సిపల్ చైర్మన్ గా సోమ్మిరెడ్డి గారి కృష్ణారెడ్డి,(INC) వైస్ చైర్మన్ గా ఆకుల సత్యనారాయణ(lNC),

గడ్డపోతారం
చైర్ పర్సన్ గా శ్రీమతి గద్దె సుష్మ,(BRS)
వైస్ చైర్మన్ గా లక్ష్మ గోని మహేందర్ గౌడ్ (BRS)

గుమ్మడిదల
చైర్మన్ చిన్న పాపాని కుమార్ గౌడ్ (BRS)
వైస్ చైర్ పర్సన్ గా
శ్రీమతి చిమ్ముల సంధ్య(BRS)

ఇస్నాపూర్
చైర్ పర్సన్ గా శ్రీమతి మోతే సుమలత (BRS)
వైస్ చైర్ పర్సన్ గా
శ్రీమతి పట్లోళ్ల మాధవి (INC)

జిన్నారం
చైర్మన్ గా నక్కిర్తి యాట జనార్ధన్ (BRS)
వైస్ చైర్మన్ గా వంగెట్టి ప్రతాప్ రెడ్డి (BJP)

కోహిర్
చైర్మన్గా ఎం. అశోక్ (INC)
వైస్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ హన్నన్ జావిద్ (INC)

నారాయణఖేడ్
చైర్మన్గా నగేష్ కుమార్ షట్కార్(INC)
వైస్ చైర్మన్ గా దారం శంకర్ (INC)

సదాశివపేట్
మున్సిపల్ చైర్ పర్సన్ గా శ్రీమతి మునిపల్లి అంజమ్మ(INC)
వైస్ చైర్మన్ గా శ్రీమతి హెచ్. రేణుక (INC)

సంగారెడ్డి
చైర్ పర్సన్ గా శ్రీమతి కూన వనిత (INC)
వైస్ చైర్మన్ గా షేక్ షఫీ అహ్మద్ (INC) ఎన్నికయ్యారు.

ఇంద్రేశం, జహీరాబాద్ మున్సిపాలిటీలలో కోరం లేకపోవడంతో ఎన్నిక రేపటికి(17.02.2026) వాయిదా పడింది.

చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను పురస్కరించుకొని అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.