గులాబీ దళమే బలం
చీలిక తెచ్చి పాగా వేయడమే లక్ష్యం
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ కోసం
అదే పార్టీ మీదగా కవిత దూకుడు
క్యాడర్, లీడర్ కోసం ఇంటర్నల్ చర్చ
గులాబీ నాయకత్వంపై కవిత మార్క్
ఖమ్మం బాధితులకు కవిత ధీమా
బీఆర్ఎస్ కంటే కవితకు మైలేజ్
ముద్ర, తెలంగాణ బ్యూరో:
సొంత పార్టీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్న కవిత.. పాత బలం కోసం రాజకీయ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కడైతే రాజకీయ నిరాదరణకు గురయ్యారో.. అక్కడీ తన బలం చూపించాలని గులాబీ దళంపై ఫోకస్ చేస్తున్నారు. ఆనాటి టీఆర్ఎస్ కు జీవం పోసిన పాత నాయకులతో చర్చలు జరుపుతున్నారు. జాగృతి పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్న కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో రాజకీయ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ కంటే వేగంగా ఆమె క్షేత్రస్థాయి సమస్యలపై స్పందిస్తూ, ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.
వారి బలహీనత.. ఇటు బలంగా…!తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక అనూహ్య మార్పు కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నేతలు ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కొంత తడబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. తాము ఇంకా సమర్థవంతమైన ప్రతిపక్షంగా మారలేకపోతున్నాం అని గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అయితే, సరిగ్గా ఇక్కడే కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో రాజకీయ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ పార్టీ కంటే వేగంగా ఆమె క్షేత్రస్థాయి సమస్యలపై స్పందిస్తూ, ప్రజల్లోకి దూసుకుపోతున్నారు.
వెలుగుమట్ల బాధితుల కోసం అనూహ్య ఉద్యమం
ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇళ్ల కూల్చివేతపై కవిత చేసిన పోరాటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణం ్వుతోంది. నిరాశ్రయులైన కుటుంబాల కోసం ఆమె ఏకంగా ఖమ్మం నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, పోలీసుల నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీఆర్ఎస్ కేడర్ అంతా స్తబ్దుగా ఉన్న తరుణంలో, ఆమె నేరుగా గ్రౌండ్ లెవల్‌లోకి వెళ్లి బాధితులకు భరోసా ఇవ్వడం ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో ఆమెపై సానుభూతి , మద్దతు పెరుగడానికి కారణం అయింది.
లిక్కర్ కేసు నుంచి విముక్తి
ఇటీవలే ఢిల్లీ లిక్కర్ కేసు నుండి విముక్తి పొందిన కవిత తెలంగాణ జాగృతి వేదికగా తన రాజకీయ పునరాగమనాన్ని అత్యంత శక్తివంతంగా చాటుకుంటున్నారు. తనను పార్టీ నుండి పంపేశారని చెబుతున్న ఆమె చేస్తున్న పోరాటాలు చూస్తుంటే.. బీఆర్ఎస్ చేయలేని పనిని ఆమె ఒంటిచేత్తో చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ వంటి అగ్రనేతలు ఇంకా వ్యూహాల్లో నిమగ్నమై ఉండగా, కవిత మాత్రం నేరుగా యాక్షన్ లోకి దిగడం బీఆర్ఎస్‌కు షాక్ లాంటిదే. కవిత ఇప్పుడు తన ‘తెలంగాణ ఉద్యమ కాలం’ నాటి పంథాను మళ్లీ ఎంచుకున్నారు. అప్పట్లో జాగృతి ద్వారా ఎలాగైతే ప్రజలను సమీకరించారో, ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో వెళ్తున్నారు. చట్టసభల్లో గొంతుక కంటే.. వీధుల్లో చేసే పోరాటమే బలంగా వినిపిస్తుంది అనే సిద్ధాంతాన్ని ఆమె పాటిస్తున్నారు.
బీఆర్ఎస్ లీడర్, క్యాడర్ జాగృతి వైపు ఆకర్షితులవుతారా?
జగదీష్ రెడ్డి చెప్పినట్లుగా పార్టీ ఇంకా ప్రతిపక్ష పాత్రకు అలవాటు పడకపోవచ్చు కానీ, కవిత మాత్రం ఇప్పటికే ఆ పాత్రలో ఒదిగిపోయారు. ప్రజా సమస్యలపై ఆమె చూపిస్తున్న ఈ తెగువ, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు ఆమెకు ప్రజల మద్దతును మరింత పెంచుతున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ కేడర్ కూడా ఆమె నాయకత్వం వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కేటీఆర్ కూడా వెంటనే.. ప్రెస్మీట్లు, సోషల్ మీడియా విమర్శలకే పరిమితం కాకుడా.. ప్రత్యక్షంగా రాజకీయ యుద్ధాలకు దిగాలన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్ లో వినిపిస్తోంది.
బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కొంత మౌనంగా ఉన్న తరుణంలో కవిత మాత్రం రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కోర్టు నుండి క్లీన్ చిట్ లభించిన తర్వాత, ఆమె మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.తాజా పరిణామాలు చూస్తుంటే కేటీఆర్,హరీష్ రావు వంటి నేతల కంటే కవితకే ప్రజల నుండి అధిక మద్దతు లభిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఖమ్మం పోరాటం.. కవిత దూకుడు
ఖమ్మం శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతంలో సుమారు 600 ఇళ్ల కూల్చివేత ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ బాధితులకు అండగా నిలిచేందుకు కవిత నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగి నిరసన చేపట్టారు. ఫిబ్రవరి 24న జరిగిన ఈ కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ ఒక్క పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది.పోలీసులు అడ్డుకున్నా, లాఠీలు చూపి బెదిరించినా వెనక్కి తగ్గకుండా బాధితుల పక్షాన నిలబడటం కవితలోని అసలైన పోరాట యోధురాలిని బయటకు తీసింది.అక్కడ ఆమె అరెస్ట్ అయిన తీరు,కార్యకర్తల్లో ఒక కొత్త ఊపును తెచ్చింది.ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె చేపట్టిన ఈ దూకుడు వైఖరి ప్రజలను విశేషంగా ఆకర్షించింది.
పోలీసుల నిర్బంధం.. కొనసాగిన దీక్ష
మంగళవారం తెల్లవారుజామున పోలీసులు కవితను దీక్షా స్థలి నుండి అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల సమస్య సాకుతో ఆమెను హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి తరలించారు. అయితే, పోలీసులు ఎంతగా అడ్డుకున్నా తన పట్టు వీడలేదు. బాధిత కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని కవిత తేల్చిచెప్పారు. అక్కడే దీక్షను కొనసాగిస్తూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ నాయకత్వానికి సవాల్‌గా మారిన కవిత చరిష్మా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ప్రస్తుతం కొంత లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుండగా, కవిత మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె నేరుగా చేస్తున్న విమర్శలు, ముఖ్యంగా మహిళా ఓటర్లను ప్రభావితం చేసేలా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బాధితులకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శాపనార్థాలను ఎదుర్కోక తప్పదని ఆమె హెచ్చరించారు. కవిత ప్రస్తుత దూకుడు చూస్తుంటే, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ రాజకీయాలకు ఆమె ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తోంది.
కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కవిత కొరకరాని కొయ్యలా మారారు. త్వరలోనే కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు తిరుమల వెంకన్న సాక్షిగా ఆమె చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో పాటు కార్యకర్తల్లోను ఆందోళన నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్‌లోని కొందరు ముఖ్య నేతలపై కవిత తుపాకీ ఎక్కుపెట్టారు. వారిపై విమర్శలు సంధిస్తూ వారికి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన అన్న కేటీఆర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. మహిళలు కేవలం ఒక తల్లిగానో, సోదరిగానో, కూతురు పాత్రల్లో మాత్రమే చూడకూడదని,వ్యక్తిగతంగా సమాన హక్కులు ఉండేలా గౌరవించాలని అన్నారు. పురుషులు మహిళలు సమాజంలో సమాన హక్కులు కలిగి ఉండాలని పేర్కొంటూ..మహిళా సాధికారతను ప్రోత్సహించాలంటూ చెప్పుకొచ్చారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ పై నెట్టింట పెద్ద చర్చే జరిగింది.
కేటీఆర్ పోస్టు చేసిన వెంటనే కవిత మరో పోస్టుతో పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇతరులకు చెప్పేముందు మహిళలకు గౌరవం ఇవ్వాలన్నది ముందుగా ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఘాటు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు మహిళలు ఇంట్లోనే సోదరులనుంచి, తండ్రుల నుంచి, భర్తల నుంచి వివక్ష ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.ఇది కేటీఆర్‌కు ఇచ్చిన కౌంటరే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కవితకు పెరుగుతున్న మద్దతు
మరో వైపు సోషల్ మీడియాలో కవితకు గట్టి మద్దతు లభిస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ లాంటి ఉద్దండుడైన నాయకుడికి అసలైన రాజకీయ వారసురాలు కవితే అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. కేసీఆర్ శైలిలోని మొండితనం, సమయస్ఫూర్తి, ప్రజల సెంటిమెంట్‌ను వాడటం వంటి లక్షణాలు కవితలో ఎక్కువగా కనిపిస్తాయని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీనివల్లే కేటీఆర్ ఎంత గ్లామరస్ లీడర్ అయినప్పటికీ, పొలిటికల్ మైలేజ్ విషయంలో కవిత ముందు ఆయన ‘తేలిపోతున్నారు’ అనే డిస్కషన్ ఇప్పుడు ఊపందుకుంది.కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్‌ను ప్రపంచం చూస్తుండవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కవితలో కేసీఆర్ నాటి ఉద్యమ స్ఫూర్తిని చూస్తున్నారు.ఖమ్మం పోరాటం తర్వాత తెలంగాణ ప్రజల్లో కవిత గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.