సొరియాసిస్ బాధితులకు మెరుగైన వైద్యం – ఫుడ్, అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర అమెరికా విభాగం అధికారి రిక్ ఆస్క్రోట్
సోరియాసిస్‌కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్సా అవకాశాలు అందించడమే తమ లక్ష్యమని అమెరికాకు చెందిన ఫుడ్, అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర విభాగం ప్రధాన కార్యనిర్వాహక అధికారి రిక్ ఆస్క్రోట్ తెలిపారు. వైద్య నిపుణులు పర్యవేక్షణలో ఇవ్వబడే ఈ బయోలాజికల్ ఔషధం సోరియాటిక్ ఆర్థ్రిటిస్ చికిత్సలో ప్రత్యేకమైన ఎంపికగా మారాలని ఆశిస్తున్నామని చెప్పారు. భారతదేశానికి చెందిన ప్రముఖ ఔషధ సంస్థ సన్ ఫార్మస్యూటికల్ ఇండస్రీస్ తయారు చేసిన బయోలాజికల్ ఔషధం ‘ఇలుమ్యా’ను సోరియాటిక్ ఆర్థ్రిటిస్ అనే కీళ్ల వ్యాధి చికిత్సకు ఉపయోగించేందుకు సమర్పించిన అదనపు బయోలాజికల్ అనుమతి దరఖాస్తును సమీక్షకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ దరఖాస్తుపై తుది నిర్ణయం ఈ ఏడాది అక్టోబర్ 29 నాటికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ దరఖాస్తు రెండు అంతర్జాతీయ మూడో దశ వైద్య పరిశోధనల ఫలితాల ఆధారంగా సమర్పించబడిందని చెప్పారు. ఈ పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక వైద్య కేంద్రాల్లో పాల్గొన్న రోగులపై 52 వారాలపాటు ఔషధ ప్రభావం, భద్రతను పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఒక లక్ష నలభై వేల మంది రోగులు ఈ ఔషధంతో చికిత్స పొందారు. ఐదేండ్ల పాటు కొనసాగిన పరిశీలనలో దీని ప్రభావం స్థిరంగా ఉండటంతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా సంతృప్తికరంగా ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఔషధం వాడకంలో అరుదుగా తీవ్రమైన అలర్జీ ప్రతిక్రియలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం వంటి దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. చికిత్స ప్రారంభానికి ముందు క్షయవ్యాధి వంటి ఇన్ఫెక్షన్ల కోసం పరీక్షలు చేయడం అవసరమని, చికిత్స సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కాగా ఈ ఔషధం ఇప్పటికే మోస్తరు నుంచి తీవ్రమైన ప్లాక్ సోరియాసిస్‌తో బాధపడుతున్న పెద్దలకు చికిత్సగా 2018లో అనుమతి పొందింది. ఇప్పుడు అదే ఔషధాన్ని సోరియాటిక్ ఆర్థ్రిటిస్ చికిత్సకు కూడా వినియోగించేందుకు అనుమతి లభిస్తే, సోరియాసిస్‌తో బాధపడుతున్న వారిలో మూడింట ఒక వంతు మందికి కనిపించే కీళ్ల నొప్పులు, వాపు వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది.