సర్పయాగం జరిగిన పుణ్య భూమి… అదే
ఏడుపాయల. గరుడ గంగగా పేరొందిన మంజీరా నది ఉద్భవించడం, నది ఏడుపాయలుగా చీలి మళ్లీ ఒకచోట కలిసి ముందుకు సాగడం గురించి పురాణ కథలున్నాయి. ద్వాపర యుగాంతంలో పాండవ వంశపు కడపటి రాజు, పాండువుల మునిమనుమడైన జనమేజయుడు తన తండ్రి పరిక్షిత్తు మహారాజు మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతమొందించేందుకు సప్తరుషులతో సర్పయాగం చేసిన స్థలామే నేటి ఏడుపాయల అని చారిత్రకత ప్రతీతి. ఇక్కడ సర్పయాగం జరిగినట్లు నేటికి ఆనవాళ్లు కనిపిస్తాయి. నదీ పాయల మధ్య ఉన్న బండరాళ్లపై యజ్ఞ గుండాలు ఏర్పాటు చేసినట్టు గుంతలు ఉండగా, ఏడుపాయలకు సమీపంలోని ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద నది ఒడ్డున మట్టిని తవ్వితే విభూతి మాదిరిగా తెల్లని మట్టి లభ్యమవుతుంది. కాగా జనమేజయుడు తలపెట్టిన సర్పయాగంలో పడి సర్పాలన్నీ ఆహుతవుతుండగా నాగుల తల్లి కద్రువ విజ్ఞప్తి మేరకు గరుత్మంతుడు పాతాళం నుంచి భోగవతి నదిని తీసుకువచ్చి సర్పయాగ స్థలికి రాగానే ఏడుపాయలుగా చీలి యజ్ఞశాల, యజ్ఞగుండాలన్నింటిని ముంచెత్తి సర్పజాతికి పుణ్యలోకగతులు ప్రాప్తించినట్టు చరిత్ర చెబుతోంది. మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్లే ఈ ప్రాంతానికి ఏడుపాయల అనే పేరు స్థిరపడగా, గంగాదేవి కాలి అందె (మంజీరా) మూలంగా ఏర్పడినందున ఇక్కడ ప్రవహించే నదికి మంజీరా నది అని పేరు వచ్చింది. వనదుర్గ మంత్ర మహిమ వల్ల ఇదంతా జరిగిందని భావించి సప్తరుషులు కలసి ఏడుపాయల్లో వనదుర్గామాతను ప్రతిష్టించారు. నేటికి వానాకాలంలో నదీ పాయ ఒడ్డున రాతి గుహలో కొలువైన వనదుర్గా భవాని మాత పాదాలను తాకూతు మంజీరా నది ప్రవహిస్తుండటం విశేషం.

మూడు రోజుల పాటు జాతర
ప్రతి యేటా మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది.
ఈనెల 15 నుండి 17 వరకు మూడు రోజులపాటు ఏడుపాయల జాతర జరుగనుంది. తొలిరోజు మహాశివరాత్రి రోజు వనదుర్గామాతకు అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు ఉంటాయి. రెండో రోజు జాతరలో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన వంద ఎడ్ల, గుమ్మటాల బండ్లు ఊరేగింపులో పాల్గొంటాయి. మూడోరోజు రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. జాతరలో మూడు రోజులు బోనాలు, సిగాలు, పోతరాజుల విన్యాసాలు, జానపదుల సందడితో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుంది. జాతరలో ప్రధాన కార్యక్రమాలు మూడు రోజుల పాటే ఉన్నా వారం రోజుల పాటు ఏడుపాయల్లో రద్దీ బాగా ఉంటుంది.
స్టేట్ టూరిజం ఫెస్టివల్
ఏడుపాయల జాతరను రాష్ట్ర ప్రభుత్వం ‘స్టేట్ టూరిజం ఫెస్టివల్’గా నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రభుత్వం ప్రతి ఏటా జాతర నిర్వహణకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోంది.
పొరుగు రాష్ట్రాల నుంచి
అంగరంగ వైభంగా జరిగే ఏడుపాయల జాతరకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తారు. చుట్టూరా నలువైపులా సహజ ప్రకృతి అందాలతో అలరారే పరిసరాలు… గలగల పారే నదీ పాయల మధ్య కన్నుల పండువగా జరిగే ఏడుపాయల జాతర ప్రతి ఒక్కరికి మధురానుభూతులను మిగిల్చే చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుంది.

ఎ.శంకర్ దయాళ్ చారి, మెదక్