Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ఫాం హౌస్‌ కలలు మానుకోవాలి

  • ఆయనవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే
  • అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టిన బుద్ధిరాలేదు
  • ఇప్పుడైనా మారకపోతే ‘స్ధానిక’ పోరులో భంగపాటు తప్పదు
  • మా పాలపై చర్చకు సవాళ్లు చేస్తే స్పందించలేదు
  • ఇప్పుడు తమ ఫాంహౌస్ లో ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారు
  • కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్​ గౌడ్​ ఫైర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : తన ఫాం హౌస్​ కే పరిమితమైన బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ పగటికలలు మానుకోవాలని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ హితవు పలికారు. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ను,బీఆర్ఎస్ పార్టీని ఛీకొట్టినా ఆయన వ్యవహార శైలి, మాట తీరులో మార్చు రాలేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై, ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చర్చకు ఎన్ని సార్లు సవాలు విసిరినా స్పందించని కేసీఆర్‌ పామ్‌హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని సెటైర్ వేశారు.కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌‌లో ఉండి మళ్లీ అధికారంలోకి వస్తామనే పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు.

స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్‌ అభ్యర్థుల కోసం ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.ప్రజలు ఫామ్‌హౌస్‌ పాలన ..గడీల పాలన కోరుకోవడం లేదు.ప్రజా పాలన..ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.పదేళ్ల కేసీఆర్‌ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్‌ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారని అన్నారు.రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులకు భిన్నంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాం లో కూరుకుపోయిన ఆయన కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్‌ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్‌,కాంగ్రెస్‌ విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదంంగా ఉందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా? అని అడిగారు.కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా..ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా,వరికి బోనస్‌,ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది అని చెప్పారు.బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనతో రేషన్‌ కార్డుల కోసం నిరుపేదలు ఎదురుచూస్తే పట్టించుకోని కేసీఆర్‌,కాంగ్రెస్‌ ప్రభుత్వం 40 లక్షల వరకు రేషన్‌ కార్డులు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.కాంగ్రెస్‌ చేస్తున్న అభివృద్ధితో బీఆర్‌ఎస్‌ ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో,రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు పలుకుతున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.