- ఈ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు చెప్పింది.
- హెచ్ సీయూ పరిసరాల్లో ఏనుగులు ఉన్నాయా?
- విద్యార్ధులను కొంతమంది కావాలని ప్రభావితం చేస్తున్నారు.
- హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా కుట్ర జరుగుతుంది.
- బీఆర్ఎస్ కంటే తక్కువ వడ్డీకి అప్పులు తీసుకువస్తున్నాం.
- సన్న బియ్యం కోసం రూ.947 కోట్లు వాడాం.
- సబర్మతిని అభివృద్ధి చేసి, మూసీని వద్దు అంటే ఎలా?
- రాష్ట్ర సంక్షేమానికి విరోధులుగా మారిన బీఆర్ఎస్ నేతలు.
- తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే విషం కక్కుతున్నారు.
- అసత్య ప్రచారానికి సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్న బీఆర్ఎస్.
- ప్రభుత్వంపై బురదజల్లే పనిలో బీఆర్ఎస్ నిమగ్నం.
- హైదరాబాద్‌లో మూసీ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటుంది.
- గాంధీ భవన్‌లో మంత్రి శ్రీధర్ బాబు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తామే కాపాడామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆ భూములను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకున్నామని, ఈ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు.రాష్ట్ర సంక్షేమానికి విరోధులుగా బీఆర్ఎస్ నేతలు మారారని శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే విషయం కక్కుతున్న బీఆర్ఎస్ నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.ఈ మేరకు శనివారం గాంధీభవన్‌లో ఎమ్మెల్సీలు అమీర్ అలీ ఖాన్, బల్మూరి వెంకట్, వైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ కాల్వ సుజాతలతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వ పథకాలు, పారదర్శకంగా నడుస్తున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారానికి దిగడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, ఏఐ టూల్స్ ద్వారా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు.చట్టాన్ని అతిక్రమిస్తే ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చని, కానీ చీప్ పాలిటిక్స్ చేసి ప్రజలను మోసగించడం బీఆర్ఎస్‌కు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.తొమ్మిదేళ్ళు క్రితం రాజస్థాన్‌లో చనిపోయిన జింక పిల్లను హెచ్ సీయూలో చనిపోయినట్లుగా చూపించారని, ఏనుగులు హెచ్ సీయూ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ఏఐ ద్వారా చూపించారని ఆయన మండిపడ్డారు. హెచ్ సీయూలోగాని, సిటీ మధ్యలో ఎక్కడైనా ఏనుగులు ఉంటాయా అని ఆయన ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం కూడా ప్రజలకు తెలుసన్నారు.విద్యార్ధులను కొంతమంది కావాలని ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా కుట్ర జరుగుతుందన్నారు.హెచ్ సీయూకి చెందిన రూ.5300 కోట్లు విలువగల భూమిని రూ. 30 వేల కోట్లు విలువకట్టి చూపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం విడ్టూరంగా ఉందన్నారు.సెక్యూరిటీ బ్యూరో ఆఫ్ ఇండియా అనే రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారా చేసిన సర్వే ప్రకారం 23 కోట్ల వాల్యూ వచ్చిందన్నారు. ఆర్ బీఐ, సెబీల నిబంధనల మేరకు బాండ్ల రూపకల్పన జరిగిందన్నారు.తక్కువ వడ్డీతో నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్ బీఐ, సెబీ వంటి ఆధీకృత సంస్థల నిబంధలకు అనుగుణంగానే డిసెంబర్ 5న రూ. 9995 కోట్ల బాండ్ బిడ్డింగ్ జరిగినట్లు ఆయన తెలిపారు. ఆ అప్పుతో తాము రైతులకు మేలు చేశామన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల్లో నిధులు వినియోగించామన్నారు.బాండ్లు ద్వారా సేకరించిన మొత్తం నుంచే రూ.2100 కోట్లు మేర రుణమాఫీ కోసం కేటాయించమని, అలాగే సన్న బియ్యం కోసం రూ.947 కోట్లు వాడామని ఆయన వివరించారు. తమ ప్రభుత్వం 9.3 శాతానికి తీసుకుంటే, బీఆర్ఎస్ 10.9 శాతం వడ్డీకి అప్పులు తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను దివాళా తీయించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుందని శ్రీధర్ బాబు విమర్శించారు. మూసీ నదీ పునరుజ్జీవన పథకం విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తప్పుడు భావజాలంతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.మూసీ పునరుద్ధరణ కోసం పర్యావరణం అవసరం లేదని అడ్డుపడుతున్నారు.ప్రభుత్వ భూమిని ప్రభుత్వం వినియోగించాలంటే పర్యావరణం పేరుతో ఆందోళనలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కోసం 8 వేల ఎకరాల అడవులను తొలగించడం వాస్తం కాదా అని ఆయన ప్రశ్నించారు. అప్పడు పర్యావరణం బీఆర్ఎస్ నేతలకు గుర్తు రాలేదా అని ఆయన నిలదీశారు.నిబంధనలకు విరుద్ధంగా 2016 నుంచి 2019 వరకు 12.12 లక్షల చెట్లు తొలగించినట్లు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో వెల్లడించిన విషయం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలం నిర్మించే సమయంలో 207 పెద్ద చెట్లను తొలగించారని, అప్పుడు ఒక్క చెట్టు కూడా నాటే ప్రయత్నం ఎందుకు చేయలేదన్నారు.హరితహారం పేరిట రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టారని, మరి రాష్ట్రంలో పచ్చదనం ఎందుకు పెరగలేదన్నారు. అసలు ఎన్ని చెట్లు బతికి ఉన్నాయో లెక్క లేదని, ఆ డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళాయని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.గుజరాత్‌లోని సబర్మతి పరివాహక ప్రాంత వాసులకు మేలు జరగాలనే బీజేపీ అభివృద్ధి చేసిందన్నారు.అదే అభివృద్ధి తెలంగాణ హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతాల్లో జరగొద్దని బీజేపీ అడ్డుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. దురుద్దేశాలతో అభివృద్దికి కులాన్ని ఆపాదిస్తున్నారని ఆయన ఆరోపించారు. మూసీ అభివృద్ధికి సంబంధించి ఎరైనా సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామని ఆయన తెలిపారు.