ముద్ర న్యూస్, హైదరాబాద్:
ఉద్యోగుల వృత్తి జీవితంలో ప్రతి దశలో అందించే కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ప్రభుత్వానికి పెట్టుబడిలాంటిదే గానీ, అనవసర ఖర్చు కాదని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ESCI) డైరెక్టర్ డా. జి. రామేశ్వర్ రావు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) ఆధ్వర్యంలో, ఎస్కీకి చెందిన పవర్ అండ్ ఎనర్జీ, వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ఎస్కీ ప్రాంగణంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా మాట్లాడిన డా. రామేశ్వర్ రావు, రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (RDSS) కింద దేశంలోని వివిధ రాష్ట్రాల డిస్కంలలో పనిచేస్తున్న 2,500 మంది మిడిల్ లెవల్ మేనేజ్‌మెంట్ ఇంజినీర్లకు గత 11 నెలలుగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
ఫండమెంటల్స్ ఆఫ్ పవర్ క్వాలిటీ, ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టమ్స్, ఫైర్ డిటెక్షన్, ఫైర్ సేఫ్టీ ఆడిట్, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక అంశాలపై సాంకేతిక అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (MPPWD), కేంద్ర రహదారులు మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులకు కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గత నాలుగున్నర దశాబ్దాలుగా ఎస్కీ వేలాది కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, వివిధ శాఖల ఇంజినీరింగ్ పనులకు థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీగా సేవలందిస్తోందని తెలిపారు. సంస్థకు విశిష్ట సేవలకుగాను తొమ్మిది సార్లు గోల్డెన్ పీకాక్ అవార్డులు లభించాయని పేర్కొన్నారు.
ఇరిగేషన్ ఇంజినీర్ల కోసం కూడా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, డ్యామ్ సేఫ్టీ గైడ్‌లైన్స్, మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ మెజర్స్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్, సిస్మిక్ సేఫ్టీ, ఫ్లడ్ డిస్పోజల్ వంటి అంశాలపై సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల డిస్కం విభాగాలకు చెందిన 60 మంది, MPPWDకు చెందిన 30 మంది, ఇతర విభాగాలకు చెందిన 10 మంది కలిపి మొత్తం 100 మంది మిడిల్ లెవల్ మేనేజ్‌మెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు. వాటర్ రిసోర్సెస్ విభాగం నిర్వహిస్తున్న శిక్షణలో వివిధ రాష్ట్రాల ఇరిగేషన్ ఇంజినీర్లు హాజరయ్యారు.
MPPWD ఇంజినీర్లకు ప్రత్యేక శిక్షణ
ఎస్కీ, హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్ల కోసం ప్రత్యేక వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది.
“మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టమ్, క్వాలిటీ ఆఫ్ పవర్ & హార్మోనిక్స్, బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (BMS), అడ్వాన్స్‌డ్ BMS ఇంటిగ్రేషన్ & అనలిటిక్స్, లిఫ్ట్ మరియు ఫైర్ సేఫ్టీ” అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
ఆధునిక మౌలిక సదుపాయాల వ్యవస్థలో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీర్ల పాత్ర అత్యంత కీలకమని డా. రామేశ్వర్ రావు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టమ్ సురక్షిత గ్యాస్ సరఫరాకు ఎంతో అవసరమని, క్వాలిటీ ఆఫ్ పవర్ & హార్మోనిక్స్ సమర్థవంతమైన విద్యుత్ పనితీరుకు కీలకమని వివరించారు.
అలాగే, BMS మరియు అడ్వాన్స్‌డ్ BMS ఇంటిగ్రేషన్ ఆధునిక భవనాలను స్మార్ట్, శక్తి సామర్థ్యంతో కూడిన సురక్షిత వాతావరణాలుగా తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు. లిఫ్ట్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీపై తాజా సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాలపై ఇంజినీర్లు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ శిక్షణ ద్వారా ఇంజినీర్లు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని, నాణ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరింత సమర్థవంతంగా సేవలందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.