Take a fresh look at your lifestyle.

నాడు వైఎస్, నేడు రేవంత్: వేం నరేందర్ రెడ్డి రాయస్‌కు ఎంపిక

నాడు వైఎస్.. నేడు రేవంత్
హస్తిన రాజకీయం
పంతం నెగ్గించుకున్న రేవంత్
రాజ్యసభకు నరేందర్ .. ఒక్క స్థానంపై పట్టు
గతంలో కేవీపీ కోసం వైఎస్సార్
ఇప్పుడు అదే కోవలో రేవంత్

ముద్ర, తెలంగాణ బ్యూరో ::
సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చారు. ఆనాడు కూడా పార్టీలోని నేతలంతా ఒకవైపు నిల్చుండి ఆనాటి సీఎం వైఎస్ ఆత్మగా పేరున్న కేవీపీకి వ్యతిరేకంగా చేసినా.. వైఎస్ మాత్రం పట్టుబట్టీ సాధించుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయం కనిపించింది. పార్టీ నేతలే కాదు.. హైకమాండ్ లోని ప్రియాంక గాంధీ కూడా సపోర్ట్ చేసిన నేతను కాదని.. వేం నరేందర్ రెడ్డి కోసం పట్టుబట్టిన రేవంత్ రెడ్డి.. తన మాటే నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిని హైకమండ్ ఖరారు చేయడం, నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రాజకీయ ప్రచారం జోరందుకుంది. వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం రేవంత్ పట్టుబట్టి మరీ సాధించుకున్నట్లు స్పస్టమవుతోంది.

సింఘ్వీకి మరో అవకాశం
గతంలో ఉప ఎన్నిక ద్వారా తెలంగాణ నుంచి పెద్దల సభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ పదవీ కాలం ముగిసినప్పటికీ.. మళ్లీ ఆయనకే ఇచ్చారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి కీలక న్యాయవాదిగా, ట్రబుల్ షూటర్‌గా ఉన్న ఆయన సేవలను దృష్టిలో ఉంచుకుని పార్టీ మళ్ళీ ఆయనకే మొగ్గు చూపింది. రాష్ట్ర నాయకత్వం కూడా సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. గత కొంతకాలంగా పార్లమెంట్‌లో పార్టీ వాణిని బలంగా వినిపించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో రాష్ట్ర కోటా అయినప్పటికీ.. రాష్ట్ర నేతలు మద్దతుగా ఉండకతప్పలేదు.

రేవంత్ నమ్మకస్తుడు ‘వేం’కు దక్కిన గుర్తింపు
ఇక రెండో అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డి పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రికి రాజకీయ సలహాదారుగా ఉన్న ఆయన, రేవంత్ రెడ్డి కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన వ్యక్తి. పార్టీ కోసం, ప్రభుత్వం కోసం తెరవెనుక ఉండి చక్రం తిప్పుతున్న నరేందర్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సిఎం రేవంత్ గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల ఆయనకున్న విధేయత, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే రెడ్డి వర్గానికి పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి ఉందని.. ఇటీవల భర్తీ చేసిన పదవులన్నీ ఇతర వర్గాలకే ఇస్తున్నామని ఈ సారి.. రెడ్డి వర్గానికిచాన్స్ ఇవ్వాలన్న వాదన రేవంత్ గట్టిగా వినిపించారు. వేం నరేందర్ రెడ్డికి కాకపోతే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఆయన ఆసక్తి చూపించలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ఏఐసీసీ నేత వంశీచంద్ రెడ్డి కోసం ప్రియాంక గాంధీ ఒత్తిడి తెచ్చినట్లు హస్తినలో ప్రచారం జరిగింది. కానీ, ప్రియాంక ప్రయత్నాలు విఫలమయ్యాయి.

విధేయతకు పట్టం
ఈ ఇద్దరి ఎంపిక ద్వారా కాంగ్రెస్ అటు జాతీయ అవసరాలను, ఇటు స్థానిక సమీకరణలను మేళవించింది. సింఘ్వీ ద్వారా ఢిల్లీ స్థాయిలో పార్టీకి బలం చేకూరుతుండగా, వేం నరేందర్ రెడ్డి ఎంపిక ద్వారా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించినట్లయింది. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్పష్టమైన మెజారిటీ దృష్ట్యా, ఈ ఇద్దరు అభ్యర్థుల ఎన్నిక దాదాపు లాంఛనమే కానుంది. ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ తమ అభ్యర్థులను నిలబెట్టకపోవడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక లాంఛనమే.

Leave A Reply

Your email address will not be published.