- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు సత్వరమే నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పెగడపల్లి రైతు వేదిక లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని, అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. విడతల వారీగా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలన్నారు. బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని, వారు ఆన్లైన్లో నిర్మాణ దశను తెలియజేసి ప్రభుత్వం నుండి సొమ్ము త్వరగా అందేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
