ముద్ర, హైదరాబాద్: తిరుప్పావై మాసోత్సవ చివరి ఘట్టం మంగళవారంనాడు ఆవిష్కృతం కానుంది. గోదా రంగనాథుల కళ్యాణోత్సవ అద్భుత ఘట్టం కమనీయంగా జరగనుంది. దానికి ముందస్తుగా సోమవారం నాడు రంగగిరి సన్నిధిలో అమ్మవారిని పెళ్ళి కుమార్తెను చేసే మంగళఘట్టం వైభవంగా జరిగింది. అశేష సంఖ్యలో గోదాస్వరూపిణులైన మహిళా మూర్తులలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మంగళ ద్రవ్యాన్ని చేతబూని, నృత్య, గాన, కోలాటం, వాద్య సమ్మిళితంగా, గోదామాత పల్లకీ సేవను మోస్తూ, రంగగిరి కింద వున్న కృష్ణాలయానికి తీసిన ఊరేగింపు కమనీయంగా సాగింది. నేత్రపర్వంగా సాగిన ఈ ఉత్సవంలో కృష్ణ స్వామికి అమ్మవారు ధరించిన తులసీ గజమాలను సమర్పించడం జరిగింది.
అనంతరం రంగనాథుని సన్నిధికి విచ్చేసి – కోలాటం, సంకీర్తనా గానం మధ్య నిత్యవిధిగా నిర్వహించినట్టుగానే వేద మంత్రోచ్ఛారణల మధ్య ‘జయతు జయతు రంగనాథ’ అంటూ స్వామికి జయధ్వానాలు పలుకుతూ, రంగనాథుని కంఠసీమలో తులసీ గజమాలను అలంకరించడం జరిగింది.అమ్మవారికి మహిళా మూర్తులు తెచ్చిన రకరకాల మంగళ ద్రవ్యాలతో కూడిన సారెను సమర్పించడం జరిగింది.అంతకుముందు ప్రఖ్యాత గాత్ర విద్వన్మణి ఆనంద్ బాగ్, శ్రీమతి ఉమ, ఏ ఎస్ రావు నగర్ సౌందర్య లహరి శ్రీమతి శివకుమారి, వర్ధమాన గాయని ప్రత్యూష వారి బృందాలు గోదాకళ్యాణ కీర్తనలను అద్భుతంగా ఆలపించారు.