Take a fresh look at your lifestyle.

2015లోనే తెలంగాణ విద్యుత్ సంస్థకు తాడిచర్ల–1 గని కేటాయింపు : కిషన్ రెడ్డి

తెలంగాణకే తాడిచర్ల 1 గనులు
రాజ్యసభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ
2015 లోనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు కేటాయింపు

న్యూఢిల్లీ :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల-1 బొగ్గు గనుల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. తాడిచర్ల-1 బొగ్గు గనులను 2015 ఆగస్ట్ 31న తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థకు కేటాయించినట్లు వెల్లడించింది. తాడిచర్ల-1 బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి.. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు.. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. 2019 మార్చి నెలలో బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ రిపోర్టుకు ఆమోదం తెలిపిన తర్వాత..2020 జూన్ నెల నుంచి దేశంలో బొగ్గు గనుల కేటాయింపుల ప్రక్రియ పూర్తిగా మారిపోయినట్లు వెల్లడించారు. వ్యాపార అవసరాలకు వినియోగించే గనులు అన్నింటినీ కేవలం వేలం ద్వారానే కేటాయించాలని ఉన్నత స్థాయి కమిటీ సూచనలు చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కొన్ని ప్రత్యేక, తప్పని పరిస్థితిల్లో మాత్రమే.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నేరుగా.. బొగ్గు గనుల కేటాయింపు చేయాలని ఆ ఉన్నత స్థాయి కమిటీ స్పష్టంగా తేల్చి చెప్పినట్లు వివరించారు. అదే సమయంలో తాడిచర్ల-2 బొగ్గు గనులను ఇప్పటివరకు ఎవరికీ కేటాయింపు చేయలేదని ఆ లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. మరోవైపు.. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు లేవని ఆరోపించారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు.మరోవైపు.. 2020 జూన్ నెల నుంచి బొగ్గు వేలం ప్రక్రియలో ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు గనులను కేటాయించలేదని తమిళనాడుకు చెందిన ఎంపీ డాక్టర్ తంబిదురై తెలిపారు. ఈ గనుల వేలం ప్రక్రియలో రాష్ట్రాలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా.. కేవలం ప్రైవేటు రంగ కొనుగోలుదారులకే కట్టబెడుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ విద్యుత్ సంస్థకు తాడిచర్ల-1 బొగ్గు గనులను కేటాయించినట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.