ముద్ర, శేరిలింగంపల్లి:
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలు నేపథ్యంలో బందోబస్తును సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., ఇతర అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు.
సీపీ ముందుగా కుత్బుల్లాపూర్ జోన్ లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని ఎల్లంపేట మున్సిపాలిటీలోని రావెల్ కోల్ జెడ్పీహెచ్ స్కూల్, ఎల్లంపేట జెడ్పీహెచ్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. అనంతరం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధి లోని అలియాబాద్ మున్సిపాలిటీలో ఉన్న లాల్ గడి మలక్ పేట్ జెడ్పీహెచ్ స్కూల్, అలియాబాద్ ఎంపీపీఎస్ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అదేవిధంగా శేరిలింగంపల్లి జోన్ లోని పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలలోని ఇంద్రేశం ఎంపీయుపీ స్కూల్, ఇస్నాపూర్ జెడ్పీహెచ్ స్కూల్, చిట్కూల్ ఎంపీపీ స్కూల్ లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో మాట్లాడి, భద్రతా పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అలాగే విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు.
సైబరాబాద్ సీపీ వెంట డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., శేరిలింగంపల్లి డిసిపి సీ.హెచ్. శ్రీనివాస్, ఐపీఎస్., కుత్బుల్లాపూర్ ఇన్ ఛార్జ్ డిసిపి సాయి మనోహర్, ఎస్బీ డిసిపి సుధీంద్ర, క్రైమ్స్ డిసిపి ముత్యం రెడ్డి, డబ్ల్యు అండ్ ఎస్ డబ్ల్యూ డిసిపి సృజన కరణం, పీడీ సెల్ ఏడీసీపీ సత్యనారాయణ, కుత్బుల్లాపూర్ ఏడీసీపీ పురుషోత్తం, శేరిలింగంపల్లి ఏడీసీపీ ఉదయ్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగి రెడ్డి, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.