Take a fresh look at your lifestyle.

నాంపల్లిలో రణరంగం … బీజేపీ, కాంగ్రెస్ మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత

  • బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్ళు, కోడిగుడ్లు విసిరిన యూత్ కాంగ్రెస్ నేతలు
  • కర్రలతో ఎదురుదాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు
  • ప్రతిగా గాంధీభన్ ను ముట్టడించి, కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించివేసిన బీజేపీ యువ మోర్చా నేతలు
  • ఉద్రిక్తతల నడుమ పలువురికి గాయాలు – నాంపల్లి మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • నిరసనకారులు అరెస్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో హైదరాబాద్​లోని నాంపల్లి రణరంగంగా మారింది. ఏఐసీసీ అగ్రనేత, వయానాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్ధి రమేశ్‌ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. ”తాను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే స్థానిక రహదార్లను కాంగ్రెస్ ఎంపీ ప్రియంకా వాద్రా బుగ్గలా” మారుస్తానంటూ బీజేపీ అభ్యర్ధి రమేష్ బిదూరీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు గాంధీభవన్ నుంచి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు వెళ్ళి ముట్టడించాలని యువజన్ కాంగ్రెస్ నేతలు భావించారు.

దీంతో పోలీసులు పెద్దసంఖ్యలో గాంధీభవన్ వద్ద మోహరించారు. గాంధీభవన్ వద్దకు వస్తే బయటకు పోనీయకుండా పోలీసులు అడ్డుకుంటారని భావించిన కొందరు యువజన్ కాంగ్రెస్ నేతలు నేరుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రియాంక గాంధీపై రమేష్‌ బిదూరి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై రాళ్ళు, కోడిగుడ్లు విసిరి దాడికి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని కర్రలతో వెంటపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు చేసుకోవడంతో పలువురు నేతలకు గాయలయ్యాయి. ఈ క్రమంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చి, కార్యకర్తలను అక్కడ నుంచి చెదరగొట్టారు.

ప్రతిగా గాంధీభవన్ ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు

యువజన కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడిని నిరసిస్తూ బీజేపీ యువమోర్చా నేతలు గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించారు. రెండు బృందాలుగా విడిపోయి గాంధీ భవన్ ముట్టడికి ప్లాన్ చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ వైపుకు రాకుండా అన్ని మార్గాలను పోలీసులు మూసివేశారు. అలాగే వేరే మార్గాల్లో గాంధీభవన్ కు వెళ్తారనే అనుమానంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. అయినప్పటికీ కొందరు బీజేపీ కార్యకర్తలు గాంధీభవన్ వద్దకు చేరుకుని కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను చించేశారు. తమను అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ యువమోర్చా కార్యకర్తలు ముందుకు కదిలారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం మరోసారి బీజేపీ కార్యాలయం వద్దకు బయలుదేరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. కాంగ్రెస్, బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు. ఈ ఘర్షణ నేపథ్యంలో నాంపల్లి మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నడుమ గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బీజేపీ, గాంధీభవన్ ముట్టడి కార్యక్రమాల్లో జరిగిన దాడి ఘటనలపై విచారణ చేపడుతున్నామని ఏసీపీ విక్రమాన్ సింగ్ తెలిపారు. సీసీ పుటేజ్ లను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. తమ నిబంధనలకు అనుగుణంగా ఘటన స్థలంలో బలగాలను మోహరించామన్నారు.

కాంగ్రెస్ తీరు మార్చుకోలేక పోతే తీవ్ర పరిణామాలు – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ మారిన కాంగ్రెస్ పార్టీ తీరు మార్చుకోలేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడడం దుర్మార్గమన్నారు. పోలీసులను వెంట తీసుకొచ్చి బీజేపీ కార్యాలయంపై రాళ్ళు విసిరాలని, పోలీసులు ఈ పద్దతిలో వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీజేపీ తలచుకుంటే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా రోడ్ల మీద తిరగలేరని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకూ కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ నిరాశతో భౌతికదాడులకు దిగడాన్ని ప్రజలు క్షమించరని అన్నారు. మరోపక్క కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, డాక్టర్ కె. లక్ష్మణ్, డీకే అరుణ, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా బీజేపీ ఎమ్మెల్యేలు దాడిని తీవ్రంగా ఖండిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రియాంకపై వ్యాఖ్యలు చేస్తే బీజేపీ ఎందుకు ఖండించలేదు? – భట్టి విక్రమార్క

తమ పార్టీ అగ్రనాయక, ఎంపీ ప్రియాంక పై బీజేపీ నేత రమేష్ బిదూరీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీజేపీ అగ్ర నాయకత్వం ఎందుకు ఖండించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మహిళల పట్ల గౌరవ మర్యాదలున్న అందరూ ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలను ఖండించాల్సిందేని అన్నారు. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నేతల దిగజారుడు రాజకీయాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తమ పార్టీ అగ్రనాయకపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా క్షణికావేశంలో యువజన కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడి చేశారని తనకు తెలిసిందన్నారు.

ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు ఉండాలి – టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

నిరసనలు ప్రజాస్వామ్య పద్దతిలో ఉండాలని యువజన కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చురకులు అంటించారు. బీజేపీ నేతలవ్యాఖ్యలు ఖండించాల్సిందేనని, కానీ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కరెక్ట్ కాదని సీరియస్ అయ్యారు. ఇదే అదునుగా భావించి గాంధీ భవన్‌పై బీజేపీ నేతలు దాడి చేయడం కూడా సరైందని అన్నారు. శాంతి భద్రతల విషయంలో బీజేపీ నేతలు సహకరించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.