ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పోచంపల్లి, బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిమంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రాకిలాద్రి రైస్ మిల్లును అనంతరం జూలూరు ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు బీబీనగర్ మండలం రుద్రవెల్లి పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం తరలింపు పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను వినియోగించి ధాన్యం నిల్వ ప్రక్రియ చేపట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ప్రతి రైస్ మిల్లు, ఐకేపీ, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
హమాలీలు, లారీల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని, ధాన్యం తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాత పార్టీ అని, గత రెండేళ్లుగా ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.
అక్కడక్కడ ఎదురవుతున్న సమస్యలను అన్ని శాఖల సమన్వయంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ధాన్యం ఎగుమతి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖ అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.