Take a fresh look at your lifestyle.

సెకండ్ ఏఎన్ఎం ల జీతాలలో కోతలు విధించడం అన్యాయం – ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్.

 

ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా :
ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జీతాల్లో కోత విధించడం సమంజసం కాదని వెంటనే వారి జీతాలను ఖాతాలలో జమ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంల జీతాలలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కోతను విధించారని వాటిని వెంటనే వారీ వారి ఖాతాలలో జమ చేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కు, డి ఎం హెచ్ ఓ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులకు వచ్చే జీతాలు చాలా తక్కువని, ఉద్యోగరీత్యా రవాణా ఖర్చులకే సగం జీతం సరిపోతుందని అటువంటి సమయంలో వారి జీతాలలో కోతను విధించడం సరికాదన్నారు. ఆధార్ బేస్డ్ అటెండెన్స్ ను పంపించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుండి జిల్లా అధికారులకు లేక వచ్చింది అన్నారు. ఆ జీవోలో కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు కూడా ఆధార్ బేస్ అటెండెన్స్ ను తీసుకోవాలని ఉందన్నారు. కానీ రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలను కోత విధించకుండా కేవలం కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే కోత విధించడం వారిపట్ల వివక్షత చూపినట్లు అవుతుందన్నారు. ఇది క్షమించరాని విషయమని తమ సంఘం భావిస్తుందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఎంత హీనంగా చూస్తున్నారో దీనిని బట్టే అర్థమవుతుందన్నారు. ఇదే విషయమై జిల్లా వైద్య శాఖ అధికారిని ఎవరన్నా కోరగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని ఆయన వాపోయారు. సెకండ్ ఏఎన్ఎం ల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యపూరిత వైఖరిని సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
ఏఐటియూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రామాంజనేయులు మాట్లాడుతూ ఓవైపు అతి తక్కువ జీతాలతోకాంట్రాక్టు ఉద్యోగం చేయలేక ఉన్న ఉద్యోగం రెగ్యులర్ కాక ఉద్యోగులు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని, ఇటువంటి సమయంలో వారి జీతాలలో కోత విధించడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో వీరికి పెంచిన పిఆర్సి వేతన బకాయిలను ఇంతవరకు మంజూరు చేయకపోవడం అన్యాయం అన్నారు. రెగ్యులర్ ఉద్యోగం చేయాలన్న కొండంత ఆశతో వీరు రెండు సంవత్సరాల క్రితం పరీక్షా రాశారని ఇంతవరకు ఆ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేయకపోవడం దురదృష్టకరమన్నారు.
సెకండ్ ఏఎన్ఎం లతోపాటు డీఈవోలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్,
పార్మసిస్ట్ లకు కోత విధించిన జీతాలను వెంటనే తిరిగి వారి ఖాతాలలో జమ చేయాలని లేకపోతే ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. వారం రోజుల్లో ఈ విషయంపై స్పష్టమైన వివరణ ఇస్తారని కలెక్టర్ తమకు తెలియజేసినట్టు వారు తెలిపారు. డి ఎం హెచ్ ఓ కు వినతిపత్రం అందజేసి తక్షణం వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెకండ్ ఏఎన్ఎం యూనియన్ ఏఐటీయూసీ)రాష్ట్ర కోశాధికారి ఎస్. రాజేశ్వరి రెడ్డి, రాష్ట్ర నాయకురాలు మెటల్డా, కే అనిత, మంగ, అన్నపూర్ణ, డీఈవోల యూనియన్ నాయకులు నరసింహ, స్వప్న, సంపూర్ణ , కళావతి* తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.