Take a fresh look at your lifestyle.

ప్రతిభ, నైతికత, కరుణ వైద్య వృత్తిలో మూల సూత్రాలు నిత్య విద్యార్థులే ఉత్తమ వైద్యులు అవుతారు ఆర్మీ కాలేజ్ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

వైద్య వృత్తిలో ప్రతిభ, నైతికత, కరుణ మూల సూత్రాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నిత్యం అధ్యయనం చేస్తూ వృత్తిని కొనసాగించే వారే ఉత్తమ వైద్యులుగా గుర్తింపు సాధిస్తారని వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.

చదువు ఎప్పుడూ ముగియదని వైద్య రంగం మనకు నేర్పే ముఖ్యమైన పాఠం అన్నారు. శాస్త్రీయ జ్ఞానం మారుతూ ఉంటుందన్న ఆయన అదే స్ధాయిలో సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. రోగుల అవసరాలు సైతం మారుతుంటాయన్నారు. జీవితాంతం విద్యార్థులుగా ఉండే వైద్యులే ఉత్తమ వైద్యులు అవుతారని చెప్పారు.

వృత్తిపరమైన ప్రతిభను కొనసాగించాలని విద్యార్ధులకు సూచించారు. అలాగే జ్ఞానం, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలన్నారు. నైతికత, నిజాయితీతో సేవ చేయాలని సూచించారు. రోగుల నమ్మకం ఆరోగ్య సేవల పునాది అన్న భట్టి.. కరుణను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. వైద్య సేవల హృదయం మానవ సేవే అన్నారు.

విద్య, క్రమశిక్షణ, సమాజ సేవకు అంకితభావంతో సాగిన 25 ఏండ్ల జీవన ప్రయాణాన్ని మనం ఈ రోజు స్మరించుకుంటున్నామని చెప్పారు. ఇది కేవలం ఒక విద్యాసంస్థ ప్రయాణాన్ని మాత్రమే కాదన్నారు. భవిష్యత్తులో ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లబోయే కొత్త తరపు ఆరోగ్య నిపుణుల విజయాలను జరుపుకునే రోజు అని తెలిపారు. 2026లో పట్టభద్రులైన అందరికీ, ఈ కాన్వకేషన్ ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. ఎన్నో ఏండ్ల కృషి, అనేక రాత్రుల చదువు, క్లినికల్ శిక్షణలో గడిపిన గంటల సమష్టి ఫలితమే ఈ రోజు అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. అంతకంటే ముఖ్యంగా, ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభమని చెప్పారు. ఇకపై మీరు సంపాదించిన జ్ఞానం సమాజ సేవగా మారాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. డెంటిస్ట్రీ, వైద్య రంగంలోని ఇతర శాఖల మాదిరిగానే, కేవలం ఒక వృత్తి మాత్రమే కాదన్న భట్టి… అది ప్రజల నమ్మకానికి ప్రతీక అన్నారు. మీ క్లినిక్‌లోకి వచ్చే ప్రతి రోగి వైద్య సహాయం మాత్రమే కాకుండా మీ నిర్ణయం, మీ దయపై విశ్వాసంతో వస్తాడన్నారు. నేడు పట్టభద్రులలో పెద్ద సంఖ్యలో యువ మహిళలు ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇది మన సమాజంలో జరుగుతున్న ఒక మంచి మార్పును సూచిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేష్ రెడ్డి, తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె .రాజేష్ రెడ్డి, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మమత కౌశిక్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.