Take a fresh look at your lifestyle.

మహిళల రక్షణకు పురుషులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి-స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

మహిళల రక్షణకు పురుషులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి
వారి భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడాలి
మహిళా భద్రత సామాజిక బాధ్యత
ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాలి
మహిళా భద్రత, ఆర్థిక స్వావలంబనకు సర్కార్ చర్యలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫిర్యాదులు, కేసుల నమోదుతో పాటు మహిళల భద్రతను ఒక సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.

ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బందికి గురిచేసినప్పుడు నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని యువతకు సూచించారు. వేధింపులను చూసి చూడనట్టు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుందని హితవుపలికిన సీఎం.. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఏ విధంగా స్పందిస్తామో, ఇతర ఆడపిల్లల విషయంలోనూ అదే తీరుగా ఆలోచించాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ జేఎన్‌టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడడంలో పురుషులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విమెన్ సేఫ్టీ విభాగాన్ని అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కేవలం కార్యక్రమాల నిర్వహిస్తే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు. మహిళను శక్తితో పోల్చుతామనీ వారిని కుటుంబ గౌరవంగా భావిస్తామని చెప్పారు. అలాంటిది మహిళలు నిత్యం అభద్రతా భావంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదని అభిప్రాయపడ్డారు.

 

ఈ దుస్థితిని నివారించేలా మనల్ని మనం సవరించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఒక మహిళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతోందని చెప్పారు.. దేశ స్వతంత్రానికి ముందు, ఆ తర్వాత కూడా మహిళలకు కీలక పదవులు, బాధ్యతలు కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటులోనూ మహిళామణులే కీలకంగా వ్యవహరించారని చెప్పారు. మహిళల శక్తిసామర్థ్యాల పట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలే అధికారిణులుగా ఉన్నారన్న సీఎం… ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధించినట్టుగా భావించాలన్నారు.

మహిళా సాధికారిత కు కృషి


తెలంగాణలో మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆర్థిక స్వావలంబన దిశగా మహిళ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేస్తున్నామని వివరించారు. తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించేలా అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామన్న ఆయన మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆడబిడ్డనే స్పూర్తిగా ఉండాలని ‘తెలంగాణ తల్లి’ మూర్తులను ప్రతిష్టించుకున్నామని వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్య సాధనలో మహిళల ముందడుగే కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడంతోనే తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించడంతోనే ఇవన్నీ నెరవేరుతాయని చెప్పారు. గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవన్నారు. కానీ ఈ రోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్‌లైన్ క్రైమ్ పెరిగిపోయిందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తూ మహిళలను వేధిస్తున్నారని మండిపడ్డారు. వీటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా పటిష్టం చేసినట్లు సీఎం వివరించారు. ఏదైనా జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు అని నిందలు వేసే చెడు సంప్రదాయాన్ని మనం వదులుకోవాలని విపక్షాలకు సూచించారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం ‘స్టాండ్ విత్ హర్’ అనే నినాదం తీసుకొని వారికి అండగా నిలబడాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి, విమెన్ సేఫ్టీ విభాగం అడిషనల్ డీజీపీ చారు సిన్హా, సినీ నటుడు సాయి ధరమ్ తేజ్, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.