ఉజ్వల భవిష్యత్తుకు స్మార్ట్ ఇంజనీరింగ్ అవసరం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు
గచ్చిబౌలి: సుస్థిర భవిష్యత్తు నిర్మాణానికి స్మార్ట్ ఇంజనీరింగ్ కీలకమని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు అన్నారు. ప్రతి సంవత్సరం మార్చి 4న జరుపుకునే ప్రపంచ ఇంజనీరింగ్ డే సందర్భంగా గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

2019లో ప్రారంభమైన ప్రపంచ ఇంజనీరింగ్ డేను ఈ సంవత్సరం “స్మార్ట్ ఇంజనీరింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ డిజిటలైజేషన్” అనే థీమ్‌తో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్, ఇండోనేషియా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, యునెస్కో సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామేశ్వర్ రావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలోని మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీ, పవర్ అండ్ ఎనర్జీ, సివిల్ ట్రాన్స్‌పోర్టేషన్, మైనింగ్ వంటి విభాగాలు స్మార్ట్ ఇంజనీరింగ్ విధానంలోనే శిక్షణ అందిస్తున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీర్లు, నాన్ ఇంజనీర్లకు సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా నైపుణ్యాలు పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, ఇండస్ట్రీ–ఇన్నోవేషన్–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, క్లైమేట్ చేంజ్ వంటి రంగాల్లో స్మార్ట్ ఇంజనీరింగ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థలు, రిన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వంటి సాంకేతికతలు భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు. డిజిటలైజేషన్, రోబోటిక్స్, ఆటోమేషన్ వల్ల పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగిందని ఆయన అన్నారు.

వాటర్ రిసోర్సెస్ విభాగాధిపతి ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నప్పటికీ యుద్ధాలు కొనసాగుతున్న పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ సమస్యను ఎదుర్కోవడం కష్టమని పేర్కొన్నారు. క్వాలిటీ అండ్ ప్రాడక్టివిటీ విభాగాధిపతి ఈ. రామకిషోర్ మాట్లాడుతూ దేశంలోని మహారత్న, నవరత్న సంస్థల్లో పర్యావరణ పరిరక్షణకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

మేనేజ్‌మెంట్ టెక్నాలజీ డివిజన్ హెడ్ డాక్టర్ యు.ఎస్. జ్యోతి మాట్లాడుతూ ఇంజనీరింగ్ రంగం నూతన ఆవిష్కరణలకు దారి తీస్తుందని చెప్పారు. మైనింగ్ ఇంజనీర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఐటీ విభాగాధిపతి సయ్యద్ అఙ్గర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ నిర్మాణానికి ఉపయోగపడాలని, విధ్వంసానికి కాదు అని అభిప్రాయపడ్డారు. ఎఫ్‌డీపీ హెడ్ పి. సాయికిశోర్ మాట్లాడుతూ తాజా ఇంజనీరింగ్ ఆవిష్కరణలపై అందరికీ అవగాహన ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సివిల్ ట్రాన్స్‌పోర్టేషన్ హెడ్ డాక్టర్ ఆర్. వెంకట్ రెడ్డి, స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. అశోక్, డీపీసీ హెడ్ డాక్టర్ సాగర్, శ్రీకాంత్, భరత్ తదితరులు మాట్లాడారు. సమావేశంలో కాలేజ్ చీఫ్ ఎస్. లక్ష్మీకాంత రావు, డాక్టర్ పి. రాజారావు సహా పలువురు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.