Take a fresh look at your lifestyle.

ఓరుగల్లుకు మహార్దశ….. గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ కు రూ. 5,257 కోట్లు మంజూరు

 
ఆ నిధులతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం
50:25:25 శాతం నిధులతో పనులు
గతంలోనే పూర్తయిన డీపీఆర్

ముద్ర, వరంగల్ :

గ్రేటర్ వరంగల్ దశ తిరిగింది. గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం రాష్ట్రప్రభుత్వం శనివారం రూ.5,257 కోట్లు మంజూరు చేసింది. వరంగల్ భూడ్రైనేజీ ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ రుణం సమకూరుస్తోంది. 50శాతం రుణం కాగా.. మరో 25 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 25శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టు చేపట్టనున్నారు. మరోవైపు గ్రేటర్‌ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం గతంలో రూ.5,257 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించారు. కాగా వరంగల్.. రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా గుర్తింపు సంపాదించుకుంది. ఓరుగల్లుకు సంబంధించి ఒకవైపు మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. మరోవైపు వరంగల్ ప్రజల చిరకాల కోరిక అయిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. మూడు దశల్లో నిధులను వెచ్చించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ముందుగానే చెప్పుకున్నట్లుగా తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిన వరంగల్‌లో ఇప్పటికీ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఫలితంగా మురుగు కాలువలు పొంగిపొర్లుతూ.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఎన్నాళ్లుగానో డిమాండ్ ఉంది. మరోవైపు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా భూగర్భంలో కాలువల వ్యవస్థను ఏర్పాటుచేస్తారు. అలాగే వర్షపునీటి ప్రవాహం-యాజమాన్య వ్యవస్థ, నీటిసరఫరా, చెరువులు, నీటి వనరుల పునరుజ్జీవం కోసం చర్యలు తీసుకుంటారు. ఇక టెలికాం, విద్యుత్తు, కేబుల్, ఇంటర్నెట్‌ వంటి వాటికి భూగర్భ సొరంగాలు నిర్మిస్తారు. ఈ పనులు అన్నీ విడతల వారీగా చేపట్టనున్నారు. మరోవైపు వరంగల్ భూగర్భ డ్రైనేజీ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనుల్లో వేగం పెరిగేందుకు అవకాశం ఉంది. డీపీఆర్ తయారీ, నిధుల మంజూరు నేపథ్యంలో త్వరలోనే వరంగల్ కొత్త రూపు సంతరించుకుంటుందని అధికారులు చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.