ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో లంచ్ మీటింగ్…
జీవన్ ను కారులో తీసుకెళ్లిన జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు…
గత స్మృతులను నెమరు వేసుకున్న ఇరువురు నాయకులు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
ఏదైనా రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలని ఒక నానుడి. ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న కేసీఆర్, జీవన్ రెడ్డిలు కలిసి పని పనిచేయనున్నారు.

ఇటీవల మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాల తన కాంగ్రెస్ అనుబంధాన్ని దూరం చేసుకుని పార్టీకి రాజీనామా చేసి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల లోని జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జీవన్ రెడ్డిని పిలిచి లంచ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి కారులో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెంట ఉంది తీసుకెళ్లారు. అనంతరం కలిసి భోజనాలు పూర్తిచేసుకుని పలు విషయాలపై చర్చించారు. జీవన్ రెడ్డి వెంట తన ముగ్గురు కుమారులను తీసుకొని వెళ్లి కెసిఆర్ పరిచయం చేశారు. ఫామ్ హౌస్ కి చేరుకున్న క్రమంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుగా వచ్చి జీవన్ రెడ్డికి పుష్పవితమా అందజేసి లోనికి ఆహ్వానించారు.

అన్నా…నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు… జీవన్ రెడ్డి
నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానినికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, తెలంగాణ సాధకుడు రైతు బాంధవుడు బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ గారి కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.

కేసీఆర్ ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’’ అంటూ తన మనసు లోని మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు. కాగా…జీవన్ రెడ్డిని అనునయిస్తూ వారిని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ వారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని, శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆథిధ్యానికి కేసీఆర్ ఆహ్వానించారు.