Take a fresh look at your lifestyle.

పేలుడు’ దందా!

 

హుజురాబాద్, జమ్మికుంటలో పేలుడు పదార్థాల అక్రమ దందా!
నిబంధనలు గాలికి.. మృత్యుశకటాలుగా మారుతున్న వాహనాలు
డిటోనేటర్లు, ఎక్స్‌ప్లోజివ్స్ ఒకేచోట..
ఏమరపాటుగా ఉంటే కిలోమీటర్ల మేర విధ్వంసమే!
అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికుల ఆందోళన

ముద్ర, కరీంనగర్ :

ఆ ప్రాంతాలు ఇప్పుడు అగ్నిపర్వతం మీద ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌ప్లోజివ్స్ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలను తుంగలో తొక్కి, లాభమే పరమావధిగా సాగుతున్న ఈ అక్రమ రవాణా స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

మృత్యువుతో వ్యాపారుల చెలగాటం

నియమ నిబంధనల ప్రకారం పేలుడు పదార్థాలను, డిటోనేటర్లను వేర్వేరు వాహనాల్లో తరలించాలి. కానీ, ఇక్కడ వ్యాపారులు ఖర్చు తగ్గించుకోవడానికి రెండింటినీ ఒకే వాహనంలో కుక్కి మరీ తరలిస్తున్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలకే భారీ పేలుడు సంభవించే అవకాశం ఉన్న ఈ పదార్థాలను ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా రద్దీగా ఉండే జనసమ్మర్థ ప్రాంతాల గుండా తరలిస్తున్నారు. పొరపాటున ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే.. కిలోమీటర్ల మేర ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.

నిద్రపోతున్న అధికార యంత్రాంగం

పట్టపగలే ఇంతటి ప్రమాదకర దందా సాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.”రద్దీగా ఉండే రోడ్లపై ఈ మృత్యు వాహనాలు తిరుగుతుంటే భయమేస్తోంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరిది?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

తక్షణ చర్యలు అవసరం
అక్రమంగా నిల్వ చేస్తున్న గోదాములపై, నిబంధనలు పాటించని వాహనాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారీ ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగకముందే యంత్రాంగం మేల్కొనాలని కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.