- మహాత్ముడి స్పూర్తితో యుంగ్ ఇండియన్ పోలీస్ స్కూల్ ఏర్పాటు
- ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత
- నిరుద్యోగులకు సాంకేతిక శిక్షణ కోసం యుంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
- ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో యుంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు
- ఒలింపిక్స్ లక్ష్యంగా యుంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతాం
- ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి వెల్లడి
- గండిపేట మండలం మంచిరేవులలో యుంగ్ ఇండియా పోలీస్ స్కూలును ప్రారంభించిన సీఎం
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: ఆనాడు పండిట్ జవహర్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, ఆయన దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందని ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అన్నారు.నెహ్రూ బాటలో..గాంధీజీ స్పూర్తితో దేశంలో ఎక్కడ లేని విధంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను మన రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేశామని తెలిపారు.గురువారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు.ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామన్నారు.దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని, ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని తెలిపారు. ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్ ను గుర్తుంచుకుంటారని అన్నారు. అలాగే ఇవాళ మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామన్నారు.దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ మా మొదటి ప్రాధాన్యత అని అన్నారు.నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి, ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించడం జరిగిందని తెలిపారు. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామనీ తెలిపారు.వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామని, ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు.ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోందని అన్నారు.ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, సైనిక్ స్కూల్ కు ధీటుగా పోలీస్ స్కూల్ ను తీర్చి దిద్దాలని, అందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని, సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలి, పోలీస్ స్కూల్ కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని, ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో స్టాఫ్ రూమ్స్, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, ఫుట్ బాల్ గ్రౌండ్ ను సందర్శించి చిన్నారులతో సరదాగా కాసేపు ఫుట్ బాల్ ఆడారు. ఐ.టి. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహణలో భాగంగా దేశ ప్రజలకు భద్రత కల్పిస్తూ, భద్రతను కాపాడే అంశంలో ప్రాణాలకు తెగించి వీధి నిర్వహణలో పూర్తి స్థాయిలో పని చేస్తున్న సిబ్బంది అందరికీ అండగా ఉండాలని, వారి పిల్లలకు అంతర్జాతీయ విద్యాప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, దయానంద్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, డిజిపి జితేందర్, శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, అనిల్ రెడ్డి, యంగ్ ఇండియా స్కూల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సి.వి.ఆనంద్, ఉన్నతాధికారులు, యంగ్ ఇండియా స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
