Take a fresh look at your lifestyle.

దేశ విభజన వాదులకు గుణపాఠం: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

దేశ విభజన వాదులకు గుణపాఠమిది

దక్షిణాదికి అన్యాయమంటూ గగ్గోలు పెట్టిన స్టాలిన్, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారు

బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కింది

తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం

కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోంది

బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులను ఓటర్ల జాబితా నుండి తొలగిస్తే తప్పేముంది?

దేశాన్ని అస్థిరపర్చే అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు ఎందుకివ్వాలి?

బెంగాల్ ప్రజలు టీఎంసీ చెంప చెళ్లు మన్పించేలా తీర్పునిచ్చారు

కరీంనగర్ ఘటనకు బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేయాలనడం పెద్ద జోక్

శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలో ఉంటుందనే సోయి కూడా బీఆర్ఎస్ కు లేదు

అట్లాంటోళ్లను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలు ఆలోచించుకోవాలి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్…

పీఏంజే జువెలర్స్ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి

వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీసిన బండి సంజయ్

ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పిన డాక్టర్లు

ముద్ర, కరీంనగర్ :
ఉత్తరాది, దక్షిణాది అని పదపదే మాట్లాడుతూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తగిన గుణపాఠం చెప్పాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ గగ్గోలు పెట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్, తోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. బీజేపీ కార్యకర్తల పోరాటాలు, త్యాగాలవల్లే బెంగాల్ లో అధికారం దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవని, కాంగ్రెస్ ముక్త్ భారత్ కల నెరవేరబోతోందని అన్నారు.

ఈరోజు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి కరీంనగర్ లోని వెంకటాద్రి, రేనే ఆసుపత్రులకు వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పీఎంజే జువెలర్స్ దోపిడీ ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వారితో నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. వారికి ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ ఏమన్నారంటే….

కరీంనగర్ లో నిన్న జరిగిన జువెలరీ షాపు ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించాను. వాళ్లకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. సేల్స్ మేనేజర్ కు బుల్లెట్ తగిలింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సర్జరీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. మధుకర్ కు బుల్లెట్ గాయమైంది. చికిత్స తీసుకుంటున్నారు. ఇది దారుణమైన ఘటన. అనుకోని సంఘటన. ఇట్లాంటి ఘటనలో గాయపడ్డ వారికి, ఆందోళనలో ఉన్న వారిని ఓదార్చడం మానవత్వం ఉన్నవాళ్లు చేసే పని. కానీ బీఆర్ఎసోళ్లు నిన్న మాట్లాడిన తీరు సిగ్గు చేటు.

పీఎంజే దోపిడీ ఘటనకు మాకేం సంబంధం? బీఆర్ఎస్ నేతల మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారు. దొంగతనం చేసే వాడికి పక్కన మంత్రి ఇల్లుందా? అని చూస్తారా? అదే నిజమైతే వాళ్లు ఎమ్మెల్యే ఇంటి మీదుగానే జువెలరీ షాప్ వద్దకు వచ్చారు. ఘటన జరిగిన సమీపంలో జిల్లా కోర్టు కూడా ఉంది. అంత మాత్రాన వాళ్లకు అంటగడతామా? ఇదేం పద్దతి? అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు.

జరిగిన ఘటనపై నిన్న డీజీపీతో మాట్లాడాను. హైదరాబాద్ నుండి టీమ్స్ వచ్చాయి. దుండుగలను పట్టుకుంటామని చెబుతున్నారు. అయితే జరిగిన ఘటనను పరిశీలిస్తే… భద్రతా వైఫల్యం కన్పిస్తోంది. ఇందులో సందేహం లేదు.

ఈ ఘటనకు బాధ్యత వహించి నేను రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు చెప్పడం చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. దేశంలో శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది. ఆ మాత్రం కూడా తెలియని వాళ్లను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న హుజూరాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలి.

ఉత్తరాది, దక్షిణాది అంటూ దేశాన్ని విభజించాలని కుట్రలు చేసిన వాళ్లకు 5 రాష్ట్రాల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. ముఖ్యంగా స్టాలిన్ కు తమిళనాడు ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారు. ఇగ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్. ఎక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా ఆ రాష్ట్రం ఓడిపోతుంది. గతంలో హర్యానా, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ లో ప్రచారం చేస్తే అక్కడా కాంగ్రెస్ ఓడిపోయింది. దక్షిణాది, ఉత్తరాది అంటూ విభజన వాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి, స్టాలిన్ లకు ప్రజలు గుణపాఠం చెప్పారు.

రేవంత్ రెడ్డికి ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ స్థానాన్ని ఆక్రమించాలా? అని ఎదురు చూస్తున్నారు. రాహుల్ గాంధీకి తెలివి లేదని, తనకే ఎక్కువ ఉందనే భావనలో ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ ఇకపై ఎక్కడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటాం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయం.

బెంగాల్ లో బీజేపీ కార్యకర్తలు ఎంతో మంది బలిదానమయ్యారు. మమతా బెనర్జీ ప్రభుత్వ దాడులను తట్టుకుని పోరాడి విజయం సాధించారు. బెంగాల్ లో అధికారంలోకి వస్తే కేంద్రంలో ఓడిపోతుందనే ప్రచారం కూడా సరికాదు. దేశంలో మోదీని తప్ప ప్రత్యామ్నయ నాయకుడు ఎవరూ లేరని ప్రజలకు తెలుసు. బెంగాల్ లో సర్ పేరుతో ఓట్లు తొలగించడంవల్లే బీజేపీ గెలిచిందని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా బెంగాల్ లో చొరబడి ఓట్లు తీసుకుని ఓట్లేస్తే చూస్తూ ఊరుకోవాలా? అక్రమ చోరబాటు దారుల చెంప చెళ్లుమన్పించేలా బెంగాల్ ప్రజలు తీర్పునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.