ప్రతివారం ప్రత్యేక అధికారులు పాఠశాలలు సందర్శించాలి
వచ్చే నెల 14 నుండి పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల సన్నద్ధతపై మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న నెల రోజులు పదో తరగతి విద్యార్థులకు చాలా కీలకమని అన్నారు. అందువల్ల ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను విధిగా సందర్శించి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రానున్న నెల రోజులపాటు ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని, అత్యవసరమైతే వారి స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ప్రత్యేక తరగతులకు హాజరు అయ్యేలా, వారు పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూడాలని అన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థులను అత్యవసరమైతే తప్ప ఇంటికి వెళ్లేందుకు అనుమతించకూడదని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందిస్తూ ప్రత్యేక తరగతులను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.
అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను ఎలా సిద్ధం చేస్తున్నారో ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఇప్పటికే రెండు మోడల్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆ పరీక్షల ప్రగతి నివేదిక ప్రకారం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నూరు శాతం ఫలితాలు వచ్చేలా చూడాలని విద్యాధికారులను ఆదేశించారు.
“పీఎం శ్రీ” పెండింగ్ బిల్లులపై సమీక్ష
జిల్లాలో పీఎం శ్రీ కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలల్లో పెండింగ్ బిల్లుల అంశంపై విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ట్రెజరీ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడితో కలిసి సమీక్షించారు. వేతన బిల్లులు మినహా అన్ని రకాల చెల్లింపులు వెనువెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్ ట్రెజరీ అధికారులు ప్రధానోపాధ్యాయులు సమర్పించిన బిల్లులను వెంటనే ఆడిట్ చేసి ఆమోదం కోసం పంపించాలని అన్నారు. వివిధ పాఠశాలల్లో వాననీటి సంరక్షణ గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, పాఠశాలల ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు