Take a fresh look at your lifestyle.

పన్నెండు నెలల్లోనే ఎంతో అభివృద్ధి చేశాం

  •  అధికారంలోకి రాగానే 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం
  • ఏడాదికి 5 లక్షల ఇండ్లు ఇస్తున్నాం
  • రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం
  • నారాయణపేట ప్రజా పాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా ముద్ర ప్రతినిధి: కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సవాల్వి సిరారు.  శుక్రవారం నారాయణ పేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు 1000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పక్ పల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఆడ బిడ్డలకు ఆలంబన ఇవ్వాలని దేశంలో ఎక్కడా లేని విధంగా నేడు మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంక్ నడిపించుకునే విధంగా పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. ఆనాడు కాంగ్రెస్ హయంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 10 సంవత్సరాలు బడుగు బలహీన వర్గాల ప్రజలను విస్మరించిందని విమర్శించారు. తిరిగి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసుకొని ఈరోజు నారాయణపేట నుంచి భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు. అవసరం అనుకుంటే నియోజకవర్గానికి 5 వేలకు పెంచుతామని పేర్కొన్నారు.

 హైదారాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణ రావు తొలి ముఖ్యమంత్రి గా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వాత తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందన్నారు. ఈ అవవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడ్డ ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటానని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లా గుండా సంవత్సరానికి 811 టి.యం.సి ల నీరు పోతుంటే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్.డి ఎస్, కల్వకుర్తి, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా 10 ఏళ్లు నిర్లక్ష్యం చేశారని ఎద్దేవా చేశారు. పైగా పోతిరెడ్డి పాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకు పోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కే సి ఆర్ ను ఉద్దేశించి విమర్శించారు.

 మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టు నిర్మాణానికి 2014లో కోట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా ఆపేశారని అన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామి ఇచ్చారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు.

       ప్రభుత్వం ఏర్పడి కేవలం 12 నెలలు పూర్తి అయ్యిందని, బీ ఆర్ ఎస్ 10 సంవత్సరాల పాలన, కేంద్రంలో 12 సంవత్సరాల మోడీ ప్రభుత్వం పాలన పై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజల పై ఉందని అన్నారు. ఈ సభలో పాల్గొన్న రాష్ట్ర ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఆగష్టు 1, 2024 న సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనల మేరకు 120 రోజుల్లో విజవంతంగా కుల గణన పూర్తి చేయడం జరిగిందని దానితో పాటు వర్గీకరణ పూర్తి చేసి అన్ని విధాలుగా వెనుకబడిన మాదిగ కులానికి 9.7 శాతం రిజర్వేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

 రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు మాత్రమే అవుతుందని ఈ 14 నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేశామని తెలిపారు. 10 సంవత్సరాల పరిపాలన చేసిన గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసి మరో 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు పెట్టీ ఇచ్చిన హామీలు ఏమయ్యిందినని అడుగుతున్నారని అన్నారు. అభివృద్ధి విషయంలో వేదిక ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

అంతకు ముందు నారాయణపేట శాసన సభ్యులు చిట్టెం పర్ణికా రెడ్డి, మంత్రులతో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారాయణ పేట జిల్లాలో దాదాపు 967 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. 56 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైద్య కళాశాల భవనానికి ప్రారంభోత్సవం చేశారు.130 కోట్ల అంచనా వ్యయంతో వైద్య కళాశాల నూతన హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. 26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనం, 40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల యూనిట్ కు శంకుస్థాపన చేశారు.

రూ. 5.58 కోట్ల వ్యయంతో నిర్మించిన ధన్వాడ, నారాయణపేటలో నిర్మించిన రూరల్ పోలీస్ స్టేషన్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు.1.23 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. 295 కోట్ల అంచనా వ్యయంతో తుంకిమెట్ల నారాయణపేట రోడ్, కోటకొండ మద్దూరు రోడ్ అభివృద్ధి పనులు, అప్పక్ పల్లి గుండిమాల్ రోడ్, మద్దూరు లింగాల్ చెడ్ రోడ్ లలో హైలెవల్ బ్రిడ్జీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 193 కోట్ల నిధులతో గుల్బర్గా కొడంగల్ , రావులపల్లి మద్దూరు, కొస్గి దౌల్తాబాద్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.    రూ.12.70 కోట్ల నిధులతో నారాయణపేట నియోజకవర్గ పరిధిలో సి.ఆర్.ఆర్. రోడ్లకు శంకుస్థాపన చేశారు. 7 కోట్లతో మరికల్ లో నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు.

పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డి.జి.పి జితేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, , నారాయణపేట శాసన సభ్యులు పర్ణిక రెడ్డి, మహబూబ్ నగర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి రెడ్డి, మక్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.